Chandrababu: నేను టీనేజి కుర్రాడిలా ఆలోచిస్తున్నా: చంద్రబాబు

  • అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • గుత్తిలో బహిరంగ సభ
  • భారీగా తరలివచ్చిన జనాలు
  • ఉత్సాహంగా ప్రసంగించిన టీడీపీ అధినేత
Chandrababu says he is thinking like a teenager

టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా గుత్తిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చానని, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 17 వేల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 

నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే, సైకో వచ్చి వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చాడు అంటూ ఎద్దేవా చేశారు. ఫిష్ మార్టుల్లో ఉద్యోగాలు అన్నాడు... అవి కూడా మూతపడ్డాయి అని వెల్లడించారు. 

"ఇవాళ నేను వస్తుంటే కుర్రాళ్ల కేరింతలను చూశాను. వాళ్లు ఆనందంతో ఆకాశానికి ఎగురుతున్నారు. నేను ఇవాళ టీనేజి పిల్లాడిలా, 13 ఏళ్ల కుర్రాడిలా ఆలోచిస్తున్నాను. 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించి, దాన్ని మీకు అందించే బాధ్యత నాది. ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తా. 

వ్యవసాయాన్ని కూడా ఆధునికీకరించుకుందాం. దాంతోపాటే ఐటీ ఆయుధం కంప్యూటర్ మౌస్ కూడా ఇస్తాను, ప్రపంచ స్థాయి కంపెనీలను మీ ఇళ్ల వద్దకే తీసుకువస్తాను. అదే... వర్క్ ఫ్రం హోమ్! అమెరికాలో ఉండే కంపెనీకి మీరు ఇంటి వద్ద నుంచే పనిచేయండి. యువతకు ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తా. ఇదే నా ష్యూరిటీ. ఈ మాట ఇంటింటికీ చెప్పాలి. మీ భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ. 

అన్నదాతలకు కూడా మాటిస్తున్నా. అనంతపురం జిల్లాను హార్టీకల్చర్ హబ్ గా మార్చుతా. పండ్ల తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను. రాష్ట్రంలో రైతే రాజుగా చేసే బాధ్యతను నేను తీసుకుంటా. 

ఆటో డ్రైవర్లకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.87 అయితే, ఏపీలో రూ.98... అంటే, మన రాష్ట్రంలో ఒక లీటర్ డీజిల్ కు రూ.11 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఆటో డ్రైవర్లపై అధికభారం పడుతోంది. రోడ్లు మరీ దారుణంగా ఉండడంతో ఆటోలు గుల్లయిపోతున్నాయి. ఎవరైనా ప్రసవానికి వెళుతుంటే ఆ గతుకుల రోడ్లపై మార్గమధ్యంలోనే డెలివరీ అయిపోతుంది. దానికితోడు ఆటో డ్రైవర్లకు అనేక విధానాలుగా జరిమానాలు విధిస్తుంటారు. 

దోచుకోవడం దాచుకోవడమే జగన్ పని.  ఎంతసేపటికీ నేనే పోరాడాలా... దోపిడీపై ప్రజలు కూడా పోరాడాలి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News