Gautam Gambhir: భారత్-పాక్ ఆటగాళ్ల మధ్య స్నేహంపై గంభీర్ వ్యాఖ్యలు.. స్పందించిన అఫ్రిది

  • మైదానంలో స్నేహంగా ఉండాల్సిన అవసరంలేదన్న గంభీర్
  • ఆటలో దూకుడుగానే ఉండాలని స్పష్టీకరణ
  • మైదానం అవతల జీవితం ఉందని గుర్తించాలన్న అఫ్రిది
  • ఆటగాళ్లు సౌహార్ద్ర రాయబారులని వెల్లడి
Afridi reacts to Gambhir comments on friendship between Bharat and Pakistan players

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉద్విగ్నతకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఒకప్పుడు దాయాది జట్ల మధ్య మ్యాచ్ లు యుద్ధాలను తలపించేవి. ఆటగాళ్ల మధ్య తీవ్రస్థాయిలో కోపతాపాలు ఉండేవి. అయితే, అది గతం. 

ఇప్పుడు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ తర్వాత భారత్, పాక్ ఆటగాళ్లు ఉల్లాసంగా ముచ్చటించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మైదానంలోనూ సుహృద్భావ చర్యలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. 

జాతీయ జట్టు తరఫున ఆడేటప్పుడు స్నేహాన్ని బౌండరీ లైన్ అవతలే వదిలేసి రావాలని హితవు పలికాడు. మైదానంలో ఆటే ముఖ్యమని, స్నేహం కాదని పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో భారత్, పాక్ ఆటగాళ్ల కళ్లలో కసి అనేది కనిపించడంలేదని గంభీర్ తెలిపాడు. 

"ఆరేడు గంటలు క్రికెట్  మ్యాచ్ ఆడిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత స్నేహంగా ఉండొచ్చు. ఆ ఆరేడు గంటలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలో ఆటగాళ్లు తమకు తాము ప్రతినిధులు కారు... దేశానికి ప్రతినిధులు. కోట్లాది మంది ప్రజలకు ప్రతినిధులు" అని స్పష్టం చేశారు. 

కాగా, గంభీర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. గౌతమ్ గంభీర్ ఆలోచనలతో తాను ఏకీభవించబోనని అన్నాడు. ఆటగాళ్ల మధ్య మైదానంలో స్నేహానికి తావు ఉండరాదన్నది గంభీర్ అభిప్రాయం అని, కానీ, తాను అలా అనుకోవడం లేదని తెలిపాడు. 

"మనం క్రికెటర్లమే కాదు, దేశాల సౌహార్ద్ర రాయబారులం కూడా. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందువల్ల మనం వారికి ఇచ్చే సందేశం ప్రేమ, గౌరవం పెంపొందించేలా ఉండాలి. మైదానంలో దూకుడుగా ఉండాల్సిందే. కానీ మైదానం అవతల కూడా జీవితం ఉందన్న విషయం మర్చిపోకూడదు" అని హితవు పలికాడు. 

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, పాక్ జట్లు మరోసారి తలపడుతున్న నేపథ్యంలో అఫ్రిది వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News