Rats: న్యూయార్క్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఎలుకలు... పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

Rats turns into main attraction in New York city
  • సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా న్యూయార్క్ నగరం
  • ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ఎలుకల జనాభా
  • సందర్శనీయ స్థలాలతో పాటు ఎలుకలను కూడా చూపిస్తున్న టూరిస్టు గైడ్లు
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో న్యూయార్క్ ఒకటి. ఇక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్ ఎంతో ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలాలు. అయితే, ఇప్పుడు న్యూయార్క్ నగరంలో మరొక అంశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదేంటో కాదు... ఎలుకలు! 

సాధారణంగా ఎలుకలు ప్రతి చోటా కనిపిస్తాయి. కానీ, న్యూయార్క్ నగరంలో ఎలుకలు సాధారణ స్థాయిలో కాదు, అసాధారణ స్థాయిలో వాటి జనాభాను పెంచుకున్నాయి. దాంతో న్యూయార్క్ నగరం అంటే మిగతా టూరిస్ట్ స్పాట్లతో పాటు ఎలుకలు కూడా అనే భావన నెలకొంది. 

అందుకే, టూరిస్టు గైడ్లు తమ షెడ్యూల్ లో నగరంలోని ఎలుకల సందర్శన కార్యక్రమాన్ని కూడా చేర్చుతున్నారు. కుప్పలుతెప్పలుగా ఉన్న న్యూయార్క్ ఎలుకలను చూసి తీరాల్సిందేనని గైడ్లు పర్యాటకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. 

పర్యాటకంగానే కాదు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కూడా న్యూయార్క్ ఎలుకలు ఆదాయ వనరుగా మారాయి. కెన్నీ బోల్ వెర్క్ అనే వ్యక్తి కేవలం న్యూయార్క్ ఎలుకలపై వీడియోలు చేస్తూ టిక్ టాక్ స్టార్ అయ్యాడు. ఇక్కడి మూషికాలపై ఏకంగా అతడు గంటన్నర పాటు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే, వేలాది మంది వీక్షించారట. 

రియల్ న్యూయార్క్ అనే టూరిస్టు ఏజెన్సీ యజమాని ల్యూక్ మిల్లర్ దీనిపై స్పందిస్తూ, తాము నిర్వహించే సిటీ టూర్లలో కొలంబస్ పార్క్ ను కూడా చేర్చామని, అక్కడి ఎలుకల సంతతిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. కొన్నాళ్లుగా న్యూయార్క్ లో ఇదే ట్రెండ్ నడుస్తోందని చెప్పారు.
Rats
New York
Tourist Destination
USA

More Telugu News