G20 Summit: జీ20 అతిథులకు బంగారం, వెండి పళ్లేల్లో భోజనాలు

  • భారత పర్యటన చిరకాలం గుర్తుండిపోయేలా ఏర్పాట్లు
  • దేశాధినేతల కోసం ప్రత్యేక పాత్రల తయారీ
  • ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో గొప్ప ఆతిథ్యం
G20 Summit Leaders to be served meals on silver gold plated tableware

జీ-20 అతిథులకు భారత పర్యటన మరిచిపోలేని అనుభూతులను మిగల్చనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల భేటీ జరగనుంది. అత్యున్నత స్థాయిలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు విచ్చేసే దేశాధినేతలు, రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులకు గుర్తుండిపోయేలా అనుభూతిని ఇవ్వాలని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ సాంస్కృతిక, వారసత్వ గొప్పతనం, వైభోగం వారికి పరిచయం చేయనుంది. సదస్సుకు విచ్చేసే అంతర్జాతీయ నేతలకు బంగారం, వెండితో చేసిన ప్లేట్లు, కప్పుల్లో ఆహారాన్ని వడ్డించనున్నారు.

200 మంది నిపుణులు 50,000 గంటల పాటు పనిచేసి 15,000 వెండి పాత్రలను తయారు చేశారు. ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లు నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు జైపూర్ కు చెందిన ఐరిస్ సంస్థ వీటిని తయారు చేసింది. వీటిని 11 హోటళ్లకు సరఫరా చేసింది. చాలా వరకు పాత్రలు స్టీల్ లేదా ఇత్తడితో తయారు చేయగా, కొన్నింటికి వెండి, కొన్నింటికి బంగారం కోటింగ్ వేశారు. జీ20 నేతలకు ఆతిథ్యం ఇస్తున్న ఢిల్లీలోని ఖరీదైన హోటళ్లు ఈ బంగారం, వెండి పూత పాత్రల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు ఐరిస్ జైపూర్ సంస్థ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా జీ20 సమావేశాలకు వచ్చే అతిథులకు ఈ పాత్రల్లో ఆహారాన్ని వడ్డించనున్నారు.

More Telugu News