cruelty: మహిళ నడవడికపై తప్పుడు ప్రచారం క్రూరత్వమే.. ఢిల్లీ హైకోర్టు

No greater cruelty than making false allegations against womans chastity Delhi High Court
  • ఆర్థిక అస్థిరత్వం వల్ల ఒత్తిడి పెరిగి వేధింపులకు దారితీస్తుందన్న కోర్టు
  • ఫ్యామిలీ కోర్టు తీర్పును పక్కన పెట్టి ఢిల్లీ మహిళకు విడాకులు మంజూరు
  • 27 ఏళ్లుగా భర్తతో విడిగా ఉంటున్న మహిళ విడాకుల పిటిషన్ పై తీర్పు
మహిళ నడవడికపై అభాండాలు వేయడంకన్నా ఎక్కువ క్రూరత్వం మరొకటి లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరియైన కారణమేనని వివరించింది. ఈ కారణంతో విడాకులు ఇవ్వలేమన్న ఫ్యామిలీ కోర్టు తీర్పును పక్కన పెట్టి ఢిల్లీ మహిళకు డైవోర్స్ మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి వేధింపులకు దారితీస్తుందని పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఓ వివాహిత విడాకుల అప్పీలు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు..

ఢిల్లీకి చెందిన ఓ మహిళ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందానని, ఉద్యోగం చేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నానని చెప్పి తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. అయితే అవన్నీ అబద్ధాలేనని పెళ్లయ్యాక తెలిసిందని చెప్పింది. భర్తకు స్థిరమైన ఉద్యోగం లేదని, పెళ్లికి ముందునుంచే తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని వివరించింది. భర్తకు ఉద్యోగం లేకున్నా సర్దుకుపోయానని, కానీ ఉద్యోగానికి వెళ్లే తనకు ఇతరులతో అక్రమ సంబంధం అంటగడుతూ వేధిస్తుండడం భరించలేకపోయానని తెలిపింది.

1989లో వివాహం కాగా 1996 నుంచి (27 ఏళ్లుగా) విడిగా ఉంటున్నానని, మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే, భార్య ప్రవర్తనపై తప్పుడు ఆరోపణలు మానసిక వేధింపుల కిందికి రావని, ఈ కారణంతో విడాకులు మంజూరు చేయలేమని ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె భర్త చేష్టలు మానసిక వేధింపుల కిందికే వస్తాయని పేర్కొంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
cruelty
false allegations
womans chastity
Delhi High Court

More Telugu News