Siddipet District: అదే తప్పు మళ్లీ చేసి..పశ్చాత్తాపంతో యువకుడి ఆత్మహత్య

  • ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పుల పాలైన యువకుడు
  • కుమారుడి అప్పులు తీర్చి పాల కేంద్రం పెట్టించిన తండ్రి
  • మళ్లీ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడు
  • అదే తప్పు మళ్లీ చేసినందుకు తీవ్ర పశ్చాత్తాపం
  • పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Siddipet youth ends life after committing the same mistake of losing money in online games

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పులపాలైన ఓ యువకుడు తండ్రి సాయంతో సమస్య నుంచి గట్టెక్కాడు. కానీ, ఆ వ్యసనం అతడిని లొంగదీసుకోవడంతో మళ్లీ ఆన్‌లైన్ ఆటలు ఆడి డబ్బుపోగొట్టుకున్నారు. ఈసారి పశ్చాత్తాపం యువకుడిని లోలోపలే దహించివేయడంతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రికి తీరని శోకం మిగిల్చాడు. సిద్దిపేట జిల్లా దౌత్లాబాద్‌ మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. 

జిల్లాలోని ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్ (19) ఇంటర్‌తోనే చదువు ఆపేశాడు. రెండేళ్ల క్రితం అప్పు చేసి ఆన్‌ లైన్ గేమ్స్ ఆడి డబ్బు నష్టపోయాడు. అతడి తండ్రి ఆ అప్పులన్నీ తీర్చి కొడుకును ఇబ్బందుల నుంచి గట్టెక్కించాడు. అతడికి గేదెలను కొనిచ్చి పాల కేంద్రం వ్యాపారం పెట్టించాడు. 

కానీ, మరోసారి ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడి డబ్బు నష్టపోయిన యువకుడిని తప్పు చేశానన్న భావన స్థిమితంగా ఉండనీయ లేదు. బుధవారం అతడు గేదెలకు గడ్డి తెచ్చుకునేందుకు తండ్రితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ వద్దామని తండ్రి చెప్పగా తాను కాసేపాగి వస్తానన్నాడు. ఇంటికి వెళ్లిన తండ్రి కొడుకు కోసం సాయంత్రం వరకూ ఎదరుచూసినా అతడు రాలేదు. 

దీంతో, ఆయన పొలం వద్దకు వెళ్లగా సతీశ్ గౌడ్ చెట్టుకు ఉరివేసుకుని కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఆన్‌లైన్ గేమ్స్ తన కొడుకు ఉసురు తీశాయంటూ గుండెలవిసేలా రోదించాడు. అయితే, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని స్థానిక ఎస్సై తెలిపారు.

More Telugu News