Udhayanidhi Stalin: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ పై కేసు

  • ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు
  • యూపీలోని రాంపూర్ సివిల్ పోలీసు లైన్స్ స్టేషన్ లో ఫిర్యాదు
  • సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉదయనిధి వరుస వ్యాఖ్యలు
FIR against Udhayanidhi Stalin Priyank Kharge over Sanatana remark

కర్ణాటక సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి పరుష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సనాతన ధర్మాన్ని తుడిచేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సమర్థించారు. దీంతో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలకు వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ సివిల్ పోలీసు లైన్స్ పోలీస్టే స్టేషన్ లో సెక్షన్ 295ఏ (మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 153 ఏ (వివిధ మత గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 

ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా గత శనివారం తమిళనాడులో ఓ కార్యక్రమం సందర్భంగా సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. మరోసారి ఈ రోజు కూడా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని తప్పుబడుతూ విమర్శలు కురిపించారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా, తన తల తెగనరికినా భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News