India: ‘భారత్’పై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక కామెంట్

  • ఇండియా అంటే భారత్ అన్న విదేశాంగ మంత్రి
  • భారత రాజ్యాంగంలోనూ ఇదే ప్రతిఫలిస్తుందని వెల్లడి
  • రాజ్యాంగం చదివి తెలుసుకోవాలని సూచన
Jaishankar weighs in on India Bharat debate amid rumours of name change

దేశం పేరును భారత్ గా మార్చడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల అభిప్రాయాలు, వ్యాఖ్యలు దీన్ని బలపరిచేలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన జీ20 విందు నిర్వహిస్తుండగా.. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ పంపించిన ఆహ్వాన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం తెలిసిందే. దీనికితోడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించడానికి కేంద్ర సర్కారు నిర్ణయించడం కూడా ఈ విధమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాను భారతీయుడినని, తన దేశం ఎప్పటికీ భారత్ గానే ఉంటుందనడం గమనార్హం. ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం దీనికి మద్దతుగా మాట్లాడారు.

‘‘ఇండియా అంటే భారత్. రాజ్యాంగంలో ఇదే ఉంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని ఆహ్వానిస్తున్నాను. భారత్ అని చెప్పారంటే దానర్థం, అవగాహన అనేవి రాజ్యంగంలోనూ ప్రతిఫలిస్తాయి’’ అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకొస్తుండడం, వలస పాలన నాటి పేర్లను మారుస్తుండడం తెలిసిందే. ఇండియా పేరు కూడా బ్రిటిష్ పాలనా సమయం నుంచే వచ్చింది. అంతకుముందు వరకు భారత్, హిందుస్థాన్ అనే పేర్లు వాడుకలో ఉండేవి.

More Telugu News