Rachakonda Police: భారీ వర్షాల వేళ రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో ట్వీట్

  • పిల్లల విషయంలో జాగ్రత్తలు చెప్పిన పోలీసులు
  • వరద నీటిలో ఆడుకునేందుకు పంపవద్దని సూచన
  • విద్యుత్ పరికరాలకు వారిని దూరంగా ఉంచాలని హెచ్చరిక
Rachakonda Police advisory for Heavy Rains in Hyderabad

భారీ వర్షాల నేపథ్యంలో సిటీ వాసులకు రాచకొండ పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ దరిదాపుల్లోకి పిల్లలను వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. వర్షంలో ఆడుకోవడానికి పంపించవద్దని చెప్పారు. ఇంట్లో విద్యుత్ పరికరాలు, బయట ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు. చెరువులు, మురుగు కాలువలకు సమీపంలో వెళ్లనివ్వకూడదని చెప్పారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాచకొండ పోలీసులు ప్రజలకు సూచించారు. నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, కిందపడ్డ కరెంట్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాత గోడలకు దగ్గర్లో, చెట్ల కింద నిలబడ వద్దని చెప్పారు. అత్యవసర సందర్భాలలో బయటకు వస్తే రోజూ మీరు వెళ్లే దారిలోనే వెళ్లాలని, దగ్గరనో మరే కారణంతోనో కొత్తదారిలో వెళ్లొద్దని హెచ్చరించారు. రోజూ వెళ్లే తోవలో ఎక్కడ ఏం ఉంటుందనేది తెలిసి ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని తెలిపారు. అత్యవసర సందర్భాలలో సాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.

More Telugu News