Bypolls: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. ఇండియా కూటమికి తొలి పరీక్ష

  • ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో నేడు ఉప ఎన్నికలు
  • ఎన్‌డీఏ, ఇండియా కూటమి మధ్య తొలిపోటీగా ఈ ఎన్నికలకు ప్రాధాన్యం
  • సెప్టెంబర్ 8న వెలువడనున్న ఫలితాలు
bypolls begins in six states commentators see it as first contest between nda indian alliance

  ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక పోలింగ్ నడుస్తోంది. ఝార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బాక్సనగర్, ధన్‌పూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుత్తుపల్లి, పశ్చిమబెంగాల్లోని ధుప్‌గురి నియోజకవర్గాల్లో నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలను బీజేపీ-ఇండియా కూటమి మధ్య తొలి పోటీగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సెప్టెంబర్ 8న వీటి ఫలితాలు వెలువడనున్నాయి. 

ధుప్‌గురి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బిషుపాద రే మరణంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. మునుపటి ఎన్నికల్లో బిషుపాద రే 4,300 ఓట్ల స్వల్ప తేడాతో తృణమూల్ నేత మిథాలీ రాయ్‌పై గెలుపొందారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ కూటమి, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని పరిశీలకులు అంటున్నారు. 

త్రిపురలోని ధన్‌పూర్, బాక్సనగర్ ఉపఎన్నికల్లో సీపీఐ(ఎమ్), బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ సీపీఐ(ఎం) బీజేపీకి గట్టిపోటీ ఇస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ధన్‌పూర్‌లో బీజేపీ తరపున బిందూ దేబ్‌నాథ్, సీపీఐ(ఎం) తరపున కౌశిక్ దేబ్‌నాథ్ బరిలో ఉన్నారు. ఇక బాక్సనగరలో బీజేపీ తరపున తజఫ్ఫల్ హుస్సేన్, సీపీఐ తరఫున మిజాన్ హుస్సేన్ బరిలో ఉన్నారు. 

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ సీటుకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చందన్ రామ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. చందర్ రామ్ భార్య పార్వతీ దాస్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వగా కాంగ్రెస్ తరపున బసంత్ కుమార్ బరిలోకి దిగారు. 

ఝార్ఖండ్ కేబినెట్ మంత్రి, జేఎంఎం నేత జగన్నాథ్ మహాతో మరణంతో డుమ్రీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మహాతో భార్య బేబీ దేవికి టిక్కెట్టు ఇచ్చింది. ఏజేఎస్‌యూ టిక్కెట్టుపై బరిలోకి దిగిన యశోదా దేవికి బీజేపీ మద్దతు ఇస్తోంది. ఎంఐఎం నేత అబ్దుల్ మొబిన్ రిజ్వీ కూడా ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మరణంతో కేరళలోని పుత్తుపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ఊమెన్ చాందీ రికార్డు స్థాయిలో 53 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున ఊమెన్ చాందీ కుమారుడు బరిలో నిలిచారు. సీపీఐ(ఎం)-ఎల్డీఎఫ్ తరపున జాక్ సీ థామస్, ఎన్డీఏ తరపున లిగిన్ లాల్ బరిలో ఉన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజక ఉపఎన్నికలో బీజేపీ, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎస్పీ నేత దారా సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ ఆయననే బరిలోకి దింపింది. ఎస్పీ తరుపున సుధాకర్ సింగ్ రంగంలోకి దిగారు. రాష్ట్ర అసెంబ్లీలో మంచి మెజారిటీ ఉన్న బీజేపీపై ఈ ఉపఎన్నిక ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News