Team India: ఓపెనర్లే కొట్టేశారు... నేపాల్ పై నెగ్గి సూపర్-4లో ప్రవేశించిన భారత్

Team India qualifies to Super Four stage in Asia Cup after beating Nepal
  • ఆసియా కప్-2023లో భారత్ కు తొలి విజయం
  • నేపాల్ పై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం
  • మొదట బ్యాటింగ్ చేసి 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైన నేపాల్
  • వర్షం వల్ల అంతరాయం
  • టీమిండియా లక్ష్యం 23 ఓవర్లలో 145 పరుగులకు కుదింపు
ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘనంగా గెలిచింది. 

శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ గ్రూప్-ఏ పోరులో టాస్ గెలిచిన భారత్... నేపాల్ కు బ్యాటింగ్ అప్పగించింది. నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా లక్ష్యఛేదనలో వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని కుదించారు. డక్ వర్త్ లూయిస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. 

భారత్ ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ ఏమంత అనుభవం లేని నేపాల్ బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగించాడు. మరో ఎండ్ లో శుభ్ మాన్ గిల్ కూడా దూకుడుగా ఆడాడు. ఈ జోడీని విడదీయడం నేపాల్ బౌలర్ల వల్ల కాలేదు. 

రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేయగా, గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. గిల్ 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. చివర్లో గిల్ ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. పాపం, నేపాల్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు. 

ఈ విజయంతో భారత్ సూపర్-4 దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. కాగా, గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం కాగా, సూపర్-4 దశలో దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచిన పాక్... రెండో స్థానంలో నిలిచిన భారత్ సెప్టెంబరు 10న కొలంబోలో తలపడనున్నాయి. 

గ్రూప్-ఏలో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అంతకుముందు పాక్ జట్టు నేపాల్ పై గెలుపొందింది. ఇప్పుడు భారత్ కూడా నేపాల్ పై విజయం సాధించింది. దాంతో భారత్, పాక్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో గ్రూప్ లో పాక్ అగ్రస్థానం దక్కించుకుంది.
Team India
Super Four
Asia Cup
Nepal

More Telugu News