Nara Lokesh: ఆగండ్రా బాబూ... రోడ్డు మీద గుంతలు చూసుకుని నడవాల్సి వస్తోంది!: లోకేశ్

  • పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ యువగళం
  • ఉండి నియోజకవర్గంలో ఆక్వా రైతులతో ముఖాముఖి
  • గోదావరి జిల్లాల్లో రోడ్లు సూపర్ అంటూ లోకేశ్ సెటైర్
  • టీడీపీ వచ్చాక వైట్ టాప్ రోడ్లు వేస్తామని హామీ
  • ఎంత ఖర్చయినా భరిస్తామని వెల్లడి
Nara Lokesh held meeting with aqua farmers in Undi

పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండి నియోజకవర్గంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 

ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా బాగున్నాయి కదా... సూపర్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"మీరు కూడా భలే వాళ్లండీ! గతంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జిల్లాకు వస్తే, ఎక్కడో ఒక గ్రామంలో పది గుంతలు ఉంటే అందరూ వచ్చి నా మీద యుద్ధం చేశారు. అలాంటిది ఈ రోజు గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుక్కునే పరిస్థితి వస్తే... ఇక్కడెవరూ మాట్లాడడంలేదు. 

ఇక్కడ నేను పాదయాత్ర చేసేటప్పుడు పైకి చూచి చేయి ఊపే పరిస్థితి లేదు... ఎందుకంటే కింద రోడ్డుపై ఉన్న గుంతలు చూసుకుంటూ జాగ్రత్తగా నడవాల్సి వస్తోంది. ఆగండ్రా బాబూ... ఇక్కడ గుంత ఉంది అని అందరికీ చెప్పాల్సి వస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాప్ రోడ్లు వేస్తాం. వైట్ టాప్ అంటే సీసీ రోడ్లు. ఖర్చు ఎక్కువైనా సీసీ రోడ్లు వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది" అని హామీ ఇచ్చారు. 

ఇక, ఆక్వా రంగం గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆక్వా రంగానికి 'జే' (జగన్) గ్రహణం పట్టిందని లోకేశ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా పరిశ్రమను బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ అని చూడకుండా సాగుదారులందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు. 

ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాక ఏఎంసీ సెస్ ను 0.25కి తగ్గిస్తామని, ఆక్వా రంగానికి సంబంధించి ఎక్కడ వసూలు అయ్యే సెస్ ను ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టే దిశగా చర్చలు తీసుకుంటామని చెప్పారు.

More Telugu News