Nara Lokesh: ఏపీ ప్రజలు నీ మంత్రుల మాదిరి బుజ్జికన్నలు అనుకున్నావా?.. జగన్‌పై లోకేశ్ విసుర్లు

  • ఉంగుటూరులోని చిననిండ్రకొలను రోడ్డుపై లోకేశ్ సెల్ఫీ
  • డేట్లు మారుతున్నాయి తప్ప రోడ్ల ఫేట్  మారడం లేదని ఎద్దేవా
  • సరిగ్గా ఒక రోడ్డు కూడా వేయడం చాతకానివాడు మూడు రాజధానులు కడతాడంటే ప్రజలు నమ్మరన్న టీడీపీ నేత
TDP leader Nara Lokesh questions CM Jagan about roads

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో గుంతలు తప్ప రోడ్డు కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను గ్రామంలోని ప్రధాన రహదారిపై సెల్ఫీ దిగిన లోకేశ్ దానిని పోస్టు చేసి రోడ్డేది? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చి 51 నెలలైనా డేట్లు మారుతున్నాయి తప్ప రాష్ట్రంలోని రోడ్ల ఫేట్ మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు మాత్రం గజం కూడా ముందుకు సాగడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ. 1.30 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టడంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా జగన్ ముఖం చూసి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. సరిగ్గా ఒక రోడ్డు వేయడం చేతకాదని, కనీసం ఒక బస్ షెల్టర్ కూడా కట్టడం చేతకాని జగన్.. ప్రాజెక్టులు, రాజధానులు కడతానంటే నమ్మడానికి ఏపీ ప్రజలు ఆయన మంత్రుల మాదిరి బుజ్జికన్నలు కాదన్న విషయాన్ని జగన్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలని లోకేశ్ సూచించారు.

More Telugu News