Udayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గేదే లేదన్న ఉదయనిధి స్టాలిన్

  • సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో భారీ కాంట్రవర్సీ
  • దేశంలో 80 శాతం జనాభా నరమేధానికి పిలుపునిచ్చాడంటూ ఉదయనిధిపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆగ్రహం
  • తప్పుడు వార్తలు వ్యాప్తి చేయద్దంటూ ఉదయనిధి ఘాటు రిప్లై
  • తాను నరమేధానికి పిలుపునివ్వలేదని స్పష్టీకరణ
  • తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఏ సవాలుకైనా సిద్ధమేనని తేల్చి చెప్పిన వైనం
Udayanidhi stalin says he stand by his words after controversial remarks on sanatana dharma

సనాతన ధర్మం దోమ లాంటిదని, సామాజిక రుగ్మతలకు కారణమతోందని ఆరోపించిన తమిళనాడు నాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ భారీ కాంట్రవర్సీకి తెరతీశారు. సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. భారత్‌లో 80 శాతం జనాభా నరమేధానికి ఉదయనిధి పిలుపునిచ్చారని మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీ తరచూ ‘ప్రేమ దుకాణం’ గురించి మాట్లాడతారు కానీ కాంగ్రెస్‌కు మిత్ర పార్టీ అయిన డీఎంకే వారసుడు మాత్రం నరమేధానికి పిలుపునిచ్చాడు. ఇండియా కూటమి తన పేరుకు తగట్టు అవకాశం వస్తే యుగాల నాటి ‘భారత్’ అనే సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఉదయనిధిపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఆయనను అరెస్టు చేసి కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు, ఉదయనిధి స్టాలిన్ తాను వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తానెక్కడా నరమేధం గురించి మాట్లాడలేదన్న ఆయన, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపున నేను మాట్లాడా. పేరియార్, అంబేద్కర్ వంటి వారు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ ఉటంకించేందుకు సిద్ధంగా ఉన్నా’’ 

‘‘నా ప్రసంగంలోని కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. దోమల కారణంగా కొవిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదే విధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎటువంటి సవాలుకైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి’’ అంటూ ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ రచయితల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కేవలం ప్రతిఘటిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మమనే భావనే తిరోగమన పూర్వకమని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని కులం, స్రీ-పురుష బేధాలతో విభజిస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి ప్రాథమికంగా వ్యతిరేకమని అన్నారు.

More Telugu News