Nara Lokesh: బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది టీడీపీనే!: నారా లోకేశ్

  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం
  • గోపాలపురం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • కల్లు గీత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి
  • బీసీలకు పుట్టినిల్లు టీడీపీ అని వెల్లడి
  • గీత కార్మికులకు అన్ సీజన్ లో సాయంపై పార్టీలో చర్చిస్తామని హామీ
Nara Lokesh held meeting with Toddy labour

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. 201వ రోజు పాదయాత్ర పొంగుటూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై పోతవరం వద్ద గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. లోకేశ్ పాదయాత్ర పోతవరం, కవులూరు, చీపురుగూడెం, నల్లజర్ల మీదుగా ప్రకాశరావుపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 

గీత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి

అన్ సీజన్ లో గీత కార్మికులకు సాయంపై చర్చిస్తాం

కల్లు గీత కార్మికులకు అన్ సీజన్ 4 నెలల సమయంలో వారిని ఆదుకోవడానికి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారా లోకేశ్ పేర్కొన్నారు. నల్లజర్లలో కల్లుగీత కార్మికులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... బీసీలకు పుట్టినిల్లు, బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చింది టీడీపీ అని వెల్లడించారు. ఎన్టీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా, చంద్రబాబు బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని వివరించారు.  

"ఉమ్మడి రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ ని హోంమంత్రిని చేసిన ఘనత టీడీపీదే. నవ్యాంధ్రలో కేఈ కృష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రి చేశాం. కల్లు గీత కార్మికుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.105 కోట్లు ఖర్చు చేశాం. ఆదరణ పథకంలో భాగంగా పనిముట్లు, టూ వీలర్ లు అందజేశాం" అని వివరించారు.

నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. కల్లు గీత కార్మికుల ఆదాయం పెంచడానికి కృషి చేస్తాం. గతంలో తాటి చెట్లు పెంచడానికి సహకారం అందించాం. 

టీడీపీ కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెచ్చి, బీమా అమలు చేసింది. 50 శాతం సబ్సిడీతో 30 లక్షల రూపాయలు వరకూ రుణాలు అందజేశాం. జగన్ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం అయినా ఇచ్చాడా? ఒక్క టూ వీలర్ ఇచ్చాడా? పనిముట్లు అందజేశారా? 

చంద్రన్న బీమా తిరిగి అమలు చేస్తాం

టీడీపీ హయాంలో బీమా పక్కాగా అమలు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వెంటనే ఆదుకున్నాం. మత్స్యకారులకు ఎలా అయితే వేట విరామం సమయంలో సహాయం అందించామో, కల్లు గీత కార్మికులకు కూడా పని లేని సమయంలో సహాయం అందించే ఆలోచన చేస్తున్నాం. చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి అమలు చేస్తాం.

బీమా సొమ్మును రూ.10 లక్షలు చేస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ దానికి కట్టుబడి ఉంది. చంద్రన్న బీమా పథకం పేరు వైఎస్ఆర్ బీమా అంటూ జగన్ పేరు మార్చాడు... కానీ పథకాన్ని నిర్వీర్యం చేశాడు.

లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్

పంచాయతీల నిధుల దొంగ జగన్ రెడ్డి: లోకేశ్ 

ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు చెబుతూ 2017లో నల్లజర్ల ప్రజలు ఏర్పాటు చేసిన శిలాఫలకం. గత ప్రభుత్వ హయాంలో నూరుశాతం సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పింఛన్లు, ఆహార భద్రత, ఎల్ఈడీ వీధి దీపాలు, గ్యాస్ సిలెండర్లు అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దాం. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేం అదనపు నిధులిచ్చి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే...  గజదొంగ జగన్ రెడ్డి పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.9 వేల కోట్లు దొంగిలించాడు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2730.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 20.3 కి.మీ.*

*202వరోజు (2-9-2023) యువగళం వివరాలు

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)

ఉదయం

8.00 – ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.20 – ఆవపాడులో స్థానికులతో మాటామంతీ.

9.50 – సింగరాజుపాలెంలో ఎస్సీ సామాజకవర్గీయులతో సమావేశం.

10.30 – పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.50 – నీలాద్రిపురంలో స్థానికులతో మాటామంతీ.

11.05 – నీలాద్రిపురంలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

మధ్యాహ్నం

12.35 – ఉంగుటూరులో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.35 – ఉంగుటూరులో భోజన విరామం.

సాయంత్రం

4.00 – ఉంగుటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – ఉంగుటూరు సెంటర్ లో బీసీ సామాజికవర్గీయులతో భేటీ.

5.30 – నారాయణపురం శివాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.50 – నారాయణపురం ఐసిఐసిఐ బ్యాంకు వద్ద ఎస్సీలతో సమావేశం.

7.50 – చిననిండ్రకొలను శివార్లలో స్థానికులతో మాటామంతీ.

రాత్రి 

8.20 – చిననిండ్రకొలను సెంటర్ లో ఆక్వారైతులతో సమావేశం.

8.30 – చిననిండ్రకొలను విడిది కేంద్రంలో బస.

******

More Telugu News