Near Death Experience: మరణం తరువాత మరో ప్రపంచం.. ఆత్మ ఉందన్నది వాస్తవం!: అమెరికా డాక్టర్ ప్రకటన

doctor who studied 5K near death experiences says there is life after death
  • మరణం అంచుల వరకూ వెళ్లివచ్చిన వారిపై డా. జెఫ్రీ లాంగ్ అధ్యయనం
  • తమ ఆత్మ శరీరం నుంచి విడివడి గాల్లోకి లేచినట్టు అనేక మంది చెప్పారని వెల్లడి
  • కొందరికి ఓ సొరంగం ద్వారా అద్భుతమైన వెలుతురు దిశగా పయనించిన అనుభవం
  • శరీరం చచ్చుబడిగా తమ చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకోగలిగామని వివరణ 
  • ఇవన్నీ ఆత్మ ఉందన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయని డా. లాంగ్ ప్రకటన

ఆత్మ, పరమాత్మ, పునర్జన్మలు.. సగటు భారతీయుడికి ఇవన్నీ తెలిసిన విషయాలే! మానవ శరీరం అశాశ్వతమైనదే కానీ ఆత్మ మాత్రం శాశ్వతమని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు బోధించాడు. ఇతర మతాలు కూడా ఆత్మ ఉనికిని అంగీకరిస్తాయి. సైన్స్ మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంది. కానీ, కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ దిశగా పరిశోధనలు చేస్తూ నిజానిజాలను వెలికితీసేందుకు, శాస్త్రీయంగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆత్మ నిజమేనని, మరణం తరువాతా ఓ జీవితం ఉందని అమెరికాకు చెందిన ఓ వైద్యుడు తాజాగా సంచలన ప్రకటన చేశాడు. మరణం అంచులవరకూ వెళ్లిన 5 వేల మందిని అధ్యయనం చేశాకే తానీమాట చెబుతున్నట్టు బల్లగుద్ది మరీ వాదిస్తున్నాడు. 

కెంటకీకి చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. జెఫ్రీ లాంగ్.. 5 వేల పైచిలుకు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌ను అధ్యయనం చేశాక మరణం తరువాత జీవితం ఉందని ప్రకటించాడు. మరణం తరువాత మనుషులకు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆయన 1998లోనే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్ స్థాపించారు. 

నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటే.. 
గుండె ఆగిపోవడం లేదా కోమాలో ఉన్న వారు అనుభవించే స్థితినే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారని డా. జెఫ్రీ వివరించారు. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన ఇలాంటి వారిలో కొందరు తమ శరీరం పనిచేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగారని, ఏం జరుగుతోందన్నది వినగాలిగారని వివరించాడు. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న అనేక మంది ఉదంతాలను తెలుసుకుని వారి అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆత్మ ఉనికిని, మరణం తరువాత మరో ప్రపంచాన్ని గుర్తించానని ఆయన వివరించారు. ‘‘ఈ దిశగా నాకు బోలెడన్ని ఆధారాలు లభించడంతో మరణం తరువాత మరో ప్రపంచం ఉందని నేను బలంగా నమ్ముతున్నా’’ అని చెప్పుకొచ్చాడు. 

నియర్ డెత్ అనుభవం చవిచూసిన వారిలో దాదాపు 45 శాతం మంది తమ ఆత్మ శరీరం నుంచి వేరు పడిన విషయాన్ని గుర్తించారు. శరీరం నుంచి వెలుపలికి వచ్చిన ఆత్మ అక్కడే గాల్లో కాసేపు తచ్చాడిందని, దీంతో, వారు అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వినగలిగారని చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం తమ ఆత్మ ఓ సొరంగంలోంచి ప్రయాణిస్తూ ఓ వెలుతురు వైపు పయనించినట్టు చెప్పుకొచ్చారు. గతంలో మరణించిన తమ బంధువులు, స్నేహితులను కలుసుకున్నట్టు తెలిపారు. తమ జీవితం మొత్తం క్షణకాలం పాటు తమ కళ్లముందు కదిలినట్టు వివరించారు. 

ఇవన్నీ సినిమాల్లో చూపించే ఘటనలు లాగా ఉన్నప్పటికీ కొందరు పిల్లలు, ముఖ్యంగా ఇలాంటి కథలు, ఆత్మల గురించి తెలియని వారు కూడా ఇదే అనుభవాన్ని పొందిన విషయాన్ని డా. జెఫ్రీ లాంగ్ స్పష్టం చేశాడు. ఇలాంటి అనుభవాల్ని శాస్త్రీయంగా వివరించే ఆధారలేవీ దొరకలేదన్న ఆయన ‘‘ఆత్మలు, మరణం తరువాత జీవితం’’ మాత్రం నిజమని తేల్చి చెప్పాడు.

  • Loading...

More Telugu News