G20 summit: పుతిన్ బాటలో చైనా అధినేత జిన్​పింగ్.. భారత్‌ వచ్చేందుకు విముఖత!

After Putin China Xi Jinping likely to skip G20 summit in Delhi
  • సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు
  • హాజరుకానున్న జో బైడెన్‌ సహా పలు దేశాల అధినేతలు
  • సదస్సుకు రావడం లేదని ఇప్పటికే ప్రకటించిన పుతిన్
ఈ ఏడాది జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరు కానున్నారు. అయితే, భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు ఇద్దరు కీలక దేశాధినేతలు దూరం అవుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన వర్చువల్‌గా పాల్గొంటారని తెలుస్తోంది. తన స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ ఢిల్లీకి వస్తారని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు.  

మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా జీ20 సమ్మిట్ కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ భారత్ రావొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్ పింగ్ హాజరుకారని చైనాలో పని చేస్తున్న భారత దౌత్యవేత్తలు వెల్లడించారు. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జిన్ పింగ్ గైర్హాజరీకి గల కారణాలను చైనా అధికారులు స్పష్టం చేయడం లేదు.
G20 summit
india
New Delhi
USA
Joe Biden
Vladimir Putin
CHINA
Xi Jinping

More Telugu News