laptops: భారత్ లో ల్యాప్ టాప్ ల తయారీకి ముందుకొచ్చిన 32 కంపెనీలు

  • జాబితాలో హెచ్ పి, డెల్, ఏసర్, లెనోవో.. యాపిల్ కంపెనీ దూరం
  • ల్యాప్ టాప్ ల దిగుమతిపై ఆంక్షల నేపథ్యంలో నిర్ణయం
  • ఉత్పత్తి ప్రారంభమైతే 75 వేల మందికి ఉద్యోగం దొరుకుతుందన్న కేంద్రం
32 firms apply to make laptops in India says union IT Minister Ashwini Vaishnaw

భారత దేశంలో ల్యాప్ టాప్ ల తయారీకి విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు. ప్రముఖ కంపెనీలు హెచ్ పి, డెల్, లెనోవో, ఏసర్, థామ్సన్ సహా మొత్తం 32 కంపెనీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. అయితే, యాపిల్ కంపెనీ నుంచి దరఖాస్తు అందలేదని చెప్పారు. ఈ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభిస్తే కొత్తగా 75 వేల ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశీయంగా ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్ డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం 2.0 ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 

పీఎల్ఐ స్కీంలో భాగంగా ఆయా కంపెనీల ఉత్పాదకతకు అనుగుణంగా ప్రయోజనాలు కల్పించనున్నట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ వివరించారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్ లో రూ.17 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సదుపాయాలు చూసి విదేశీ కంపెనీలు దేశానికి క్యూ కడుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ఇటీవల ల్యాప్ టాప్ ల దిగుమతిపై ఆంక్షలు విధించినట్లు మంత్రి తెలిపారు. మన దేశంలో ల్యాప్ టాప్ ల తయారీని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు.

More Telugu News