Rakshabandhan: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కి.మీ. నడుచుకుంటూ వెళ్తున్న అవ్వ.. వైరల్ వీడియో

  • కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన
  • కాలిబాటలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు
An Old Woman Walking 8 Kilometers to tie Rakhi for Her Brother

సోదర ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా ఓ అవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టడానికి బయలుదేరింది. తమ్ముడు ఉంటున్న ఊరు వెళ్లడానికి బస్సు కోసమో, ఆటో కోసమో ఎదురు చూడకుండా తన కాళ్లనే నమ్ముకుంది. ఎనిమిది కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. అదే దారిలో వస్తున్న ఓ యువకుడు పలకరించగా.. తన తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళుతున్నానని చెప్పింది. తమ్ముడిపై ఆ అవ్వ ప్రేమకు హ్యాట్సాఫ్ చెబుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడా యువకుడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలోని వివరాలు..

కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ వృద్ధురాలు పొరుగున ఉన్న కొండయ్యపల్లికి నడుచుకుంటూ వెళ్లింది. దారి మధ్యలో ఎదురైన యువకుడు అవ్వను పలకరించి ఎక్కడికి పోతున్నావని అడగగా.. కొండయ్యపల్లికి పోతున్నా అని బదులిచ్చింది. ఆ ఊరిలో తన తమ్ముడు ఉంటున్నాడని, రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టడానికి పోతున్నానని చెప్పింది. తమ్ముడిపై ప్రేమతో కష్టపడి నడుచుకుంటూ వెళుతున్న అవ్వను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తమ్ముడిపై ఆ అవ్వకున్న ప్రేమను చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News