Vivek Ramaswamy: వివేక్ రామస్వామి చాలా చాలా ఇంటెలిజెంట్.. తన ప్రత్యర్థిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంస

  • తన ప్రభుత్వంలో వివేక్ రామస్వామి గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడని ట్రంప్ వ్యాఖ్య
  • అతడు చాలా ఉత్సాహవంతుడు, తెలివిగలవాడంటూ కితాబు
  • రిపబ్లిక్ పార్టీలో వివేక్‌కు క్రమంగా పెరుగుతున్న మద్దతు
  • రేటింగ్స్ పరంగా వివేక్‌కు ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ల తరువాతి స్థానం
  • ట్రంప్ ప్రభుత్వం ఉపాధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని గతంలోనే పేర్కొన్న వివేక్ రామస్వామి
Donald Trumps Big Praise For Indian american Rival Vivek Ramaswamy

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి పాప్యులారిటీ క్రమంగా పెరుగుతోంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు, వివేక్ ప్రధాన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. తన ప్రభుత్వంలో ఆయన గొప్ప ఉపాధ్యక్షుడు కాగలరంటూ కితాబునిచ్చారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అతను చాలా చాలా తెలివిగల వ్యక్తి. గొప్ప ఉత్సాహవంతుడు. అతను నా ప్రభుత్వంలో గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడు’’ అని వ్యాఖ్యానించారు. వివేక్‌ రామస్వామికి ఉపాధ్యక్ష పదవి ఇస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానమిచ్చారు. 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పాటూ వివేక్ రామస్వామి కూడా పొటీపడుతున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం ఇటీవల జరిగిన తొలి చర్చా కార్యక్రమంలో ట్రంప్ మినహా పాల్గొన్న ఎనిమిది మందిలో వివేక్ కూడా ఒకరు. ఈ డిబేట్‌లో వివేక్ రామస్వామి తన ఉత్సాహం, వాక్చాతుర్యం, స్పష్టమైన రీతిలో అభిప్రాయాల వ్యక్తీకరణతో రిపబ్లికన్ పార్టీ అభిమానులు, కార్యకర్తల మద్దతు పొందారు. డిబేట్‌లో మిగతా అభ్యర్థులపై పైచేయి సాధించారు. ఈ చర్చా కార్యక్రమంలో ట్రంప్‌పై వివేక్ రామస్వామి ప్రశంసల జల్లు కురిపించారు. 21 శతాబ్దపు గొప్ప అధ్యక్షుడిగా ట్రంప్‌ను అభివర్ణించారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై వివేక్ అభిప్రాయాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం రేటింగ్స్ పరంగా  వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ ఉన్నారు. 

రిపబ్లికన్ పార్టీ తొలి చర్చా కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనకపోయినా తన ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడి ఎంపిక కోసం ఈ డిబేట్ వీక్షిస్తానని అప్పట్లోనే ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వంలో ఉపాధ్యక్ష పదవి చేపట్టడంపై తనకు ఎలాంటి ఆసక్తీ లేదని వివేక్ రామస్వామి గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.

More Telugu News