Rajasthan: బీజేపీ ప్రచారంలో తొలిసారిగా చంద్రయాన్-3 ప్రస్తావన

Rajasthan BJPs Mass Outreach Programme Features Chandrayaan 3 Success
  • చిత్తోర్‌ఘడ్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ ప్రచార కార్యక్రమం
  • కార్యక్రమంలో చంద్రయాన్-3 ల్యాండర్ నమూనా ప్రదర్శన
  • ల్యాండర్ నమూనా పైకి ఎగురుతున్న వీడియోను షేర్ చేసిన సీపీ జోషి
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష బీజేపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. చిత్తోర్‌ఘడ్‌లో జరిగిన బీజేపీ ప్రచారంలో తొలిసారిగా చంద్రయాన్-3 విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. 

చిత్తోర్‌ఘడ్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి ఆధ్వర్యంలో బుధవారం మెవార్ ప్రాంతం నుంచి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. నవ్ మదతా సంగమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రయాన్ ల్యాండర్‌ నమూనాను ప్రదర్శించారు. ప్రచారానికి హాజరైన ప్రజల జయజయధ్వానాల నడుమ ల్యాండర్ నమూనా నేలపై నుంచి ఆకాశానికి ఎగసింది. సారే జహాసే అచ్ఛా పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా ప్రజలు జాతీయ జెండాలు ఊపుతుండగా ల్యాండర్ గాల్లో ఎగురుతున్న వీడియోను సీపీ జోషీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 

మరోవైపు.. అధికార కాంగ్రెస్ ప్రజల మద్దతు నిలబెట్టుకునేందుకు ఉచితాల బాట పట్టింది. 100 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. ఆ తరువాత 100 యూనిట్లకు శ్లాబులు లేకుండా ఒకే ధర నిర్ణయిస్తామని పేర్కొంది. అంతకుమునుపు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వంట గ్యాస్‌పై భారీగా సబ్సిడీ ప్రకటించారు. కాగా, చంద్రయాన్-3 విజయాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Rajasthan
BJP
Chandrayaan-3
Congress

More Telugu News