Supreme Court: రెండ్రోజుల్లో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదాపై కేంద్రం కీలక ప్రకటన!

On JK statehood question statement on Thursday Centre tells Supreme Court
  • ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ
  • జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తాత్కాలిక చర్య అన్న కేంద్రం
  • పరిస్థితులు చక్కబడ్డాక రాష్ట్రంగా జమ్మూ కశ్మీర్ ఉంటుందన్న సొలిసిటర్ జనరల్
  • లడఖ్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని స్పష్టీకరణ

జమ్మూ కశ్మీర్ ‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పిస్తామని తెలిపింది. అయితే రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని మంగళవారం కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కలిగిన ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. 

2019లో 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూ కశ్మీర్, లడఖ్)గా చేశారు. తాజాగా, విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జమ్మూ కశ్మీర్‌ను జమ్మూ కశ్మీర్, లడఖ్ పేరిట రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని, ఇది తాత్కాలికమేనని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంగా మారుతుందని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉండిపోతుందని స్పష్టం చేశారు. ఆగస్ట్ 31న అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత సానుకూల ప్రకటన వస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఎల్లుండి కీలక ప్రకటన వెలువడుతుందన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉందన్నారు. 

మెహతా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఇలా తాత్కాలికం ఎంత కాలమని, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించింది. దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్ ఉందా? ఆ రోడ్డు మ్యాప్ మా ముందు పెట్టాలని పేర్కొంది. మీరు ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఎలా మార్చగలరు? అలాగే ఇది ఎంతకాలం కొనసాగుతుంది? అన్న అంశాలను సవివరంగా కోర్టుకు స్పష్టం చేయాలని తెలిపింది. ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ముఖ్యమని స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2020లో జమ్మూ కశ్మీర్‌లో మొదటిసారి డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంటల్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికలు జరిగాయని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, ఆ తర్వాత హర్తాల్‌లు, దాడులు కొనసాగాయని తెలిపారు. అయితే ఇప్పుడు అంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను కల్పిస్తామన్నారు.

  • Loading...

More Telugu News