Goshamahal: పార్టీ మార్పుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

  • బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి చచ్చినా వెళ్లనన్న ఎమ్మెల్యే
  • బీజేపీ టికెట్ ఇవ్వకుంటే కొన్నాళ్లు రాజకీయాలు వదిలేస్తానని వ్యాఖ్య
  • హిందూ రాష్ట్రం కోసమే కొట్లాడతానని స్పష్టం చేసిన రాజా సింగ్
Goshamahal MLA Raja singh Pressmeet

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. తాను హిందూ వాదినని, హిందూ రాష్ట్రం కోసమే కొట్లాడతానని పేర్కొన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ను పార్టీ త్వరలోనే ఎత్తివేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ తోనే పోటీ చేస్తానని చెప్పారు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారుతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. బీజేపీ టికెట్ వస్తుందని తనకు నమ్మకం ఉందని చెప్పారు. అవసరమైతే రాజకీయాలకు కొంత విరామం ప్రకటించి హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తానని వెల్లడించారు. అంతేకానీ లౌకిక పార్టీల్లోకి చచ్చినా వెళ్లేది లేదని తేల్చిచెప్పారు.

బీజేపీ స్టేట్ కమిటీ కానీ, సెంట్రల్ కమిటీ కానీ తన విషయంలో సానుకూలంగా ఉందని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయడానికి వారు సరైన సమయం కోసం చూస్తున్నారని రాజాసింగ్ వివరించారు. ఆ టైం తొందర్లోనే వస్తుందని, మళ్లీ గోషా మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తానని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ చేతిలో లేదని రాజా సింగ్ చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టాలనేది నిర్ణయించేది ఎంఐఎం పార్టీయేనని ఆరోపించారు. ఓవైసీ సోదరులు ఎవరి పేరు చెబితే వారికే కేసీఆర్ టికెట్ ఇస్తారని విమర్శించారు.

More Telugu News