Article 35A: ఆర్టికల్ 35ఏ ప్రాథమిక హక్కులను లాగేసుకుంది.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

  • ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ
  • రాష్ట్రేతరుల హక్కులను 35ఏ కాలరాసిందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్
  • జమ్మూకశ్మీర్ రాజ్యంగం కంటే దేశ రాజ్యాంగం గొప్పదన్న సీజే
Scrapped Article 35A Took Away Fundamental Rights says CJI

జమ్మూకశ్మీర్‌లో నివసించని ప్రజలకు ఆర్టికల్ 35ఏ కొన్ని రాజ్యంగ హక్కులను దూరం చేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని సమాన అవకాశాలు, ఉద్యోగం, భూమి కొనుగోలు చేసే హక్కు వంటివి ఈ ఆర్టికల్ లాగేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు ఉండడం వల్ల రాష్ట్రేతరులకు ఇవి అందకుండా పోయాయన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యంగం కంటే దేశ రాజ్యంగం గొప్పదని ఆయన స్పష్టం చేశారు.  

ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. అదే సమయంలో రాష్ట్రేతరులకు ఎలాంటి హక్కులు లేకుండా అడ్డుకున్నాయి. దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించే ఆర్టికల్ 16(1), దేశంలో ఎక్కడైనా స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19 రెండింటినీ 35ఏ అధికరణ లాగేసుకుందని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఎత్తివేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు.

More Telugu News