Urvashi: తనకు మద్యం ఎలా అలవాటైందో చెప్పిన సీనియర్ నటి

Senior actress Urvashi told about her drinking habit
  • ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఊర్వశి
  • 2000 సంవత్సరంలో మలయాళ నటుడు మనోజ్ కె జయన్ తో పెళ్లి
  • అత్తగారి కుటుంబం అంతా తాగుబోతులేనని వెల్లడి  
  • భర్త కూడా తనను తాగమని ప్రోత్సహించాడన్న ఊర్వశి
  • మద్యానికి బానిస అయ్యానంటూ భర్త విడాకులు ఇచ్చాడని వెల్లడి
జన్మతః మలయాళీ అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన నటి ఊర్వశి. రంగస్థల నటుల కుటుంబంలో పుట్టిన ఊర్వశి అసలు పేరు కవితా రంజని. 70వ దశకం చివర్లో బాలనటిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పాతిక పైగా చిత్రాల్లో నటించింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి తన జీవితంలోని చీకటి దశను వివరించింది. తాను మద్యానికి ఎలా, ఎక్కడ, ఎవరి ద్వారా బానిసైందీ వెల్లడించింది. కెరీర్ ఊపు మీదున్న దశలో మనోజ్ కె జయన్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని ఊర్వశి తెలిపింది. 

మనోజ్ కె జయన్ కూడా నటుడే. వీరిద్దరూ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అత్తవారింట అడుగుపెట్టిన ఊర్వశికి దిగ్భ్రాంతికర వాతావరణం ఎదురైంది. అత్తగారింట్లో అందరూ మద్యం అలవాటున్నవారే. పైగా, కుటుంబం మొత్తం కూర్చుని మద్యం తాగడం ఊర్వశి కంటపడింది. 

"వాళ్లు నన్ను కూడా తాగమని ఒత్తిడి చేశారు. నా భర్త కూడా ప్రోత్సహించాడు. ఆ విధంగా నాకు మద్యం అలవాటైంది. చివరికి అది వ్యసనంలా తయారైంది. మద్యం సాకుతో మనోజ్ కె జయన్ నాకు విడాకులు ఇచ్చాడు. మద్యానికి బానిసైన నువ్వు బిడ్డను సరిగా పెంచలేవు అంటూ నా కూతుర్ని కూడా తీసుకెళ్లారు. 

దాంతో నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఒంటరితనంతో కుమిలిపోయాను. ఆ దశలో శివప్రసాద్ అని మా కుటుంబానికి దగ్గరి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అప్పటికి నాకు 40 ఏళ్లు. శివప్రసాద్ ను రెండో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను. 

నేను మళ్లీ పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. అయితే ఆ విమర్శలను నేను పట్టించుకోలేదు. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వ్యక్తిని పెళ్లాడడం తప్పు ఎలా అవుతుంది?" అని ఊర్వశి వివరించారు.
Urvashi
Drinking
Liquor
Actress
Kerala

More Telugu News