Online Rummy: ఆన్ లైన్ రమ్మీపై ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు

  • గతంలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించిన ఏపీ సర్కారు
  • నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
  • హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించాలన్న సుప్రీం కోర్టు
Supreme Court issues directives to AP High Court on Online Rummy

ఏపీ ప్రభుత్వం మూడేళ్ల కిందట రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీ వ్యసనానికి బానిసలవుతున్న వ్యక్తులు జీవితాలను తల్లకిందులు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేరకు తీవ్ర నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్లింది. 

ఆన్ లైన్ రమ్మీపై నిషేధం వద్దని ఏపీ హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. ఆన్ లైన్ రమ్మీ అనేది గేమా? లేక అదృష్టంపై ఆధారపడిన అంశమా? అనే విషయాన్ని తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, ఏపీ సర్కారు రాష్ట్ర హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు తాజాగా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది. 

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. 3 వారాల వరకు హైకోర్టు తుది తీర్పు అమల్లోకి తీసుకురావొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

More Telugu News