Afghanistan: సైట్ సీయింగ్ మీకు అవసరం లేదు: మహిళలపై మరో ఆంక్ష విధించిన తాలిబన్ ప్రభుత్వం

  • మహిళల హక్కులను కాలరాస్తున్న ఆఫ్ఘన్ ప్రభుత్వం
  • ఇప్పటికే పలు ఆంక్షలతో స్వేచ్ఛను కోల్పోయిన ఆఫ్ఘన్ మహిళలు
  • పార్క్ లోకి మహిళలను నిషేధిస్తూ తాజా ఆంక్షలు
Afghanistan Taliban govt bans women to enter into park

ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల ప్రభుత్వం ఆ దేశ మహిళలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. పలు ఆంక్షలను విధిస్తూ వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తోంది. తాజాగా వారిపై మరోసారి ఆంక్షలు విధించింది. ఆఘ్ఘనిస్థాన్ లోని ప్రధానమైన జాతీయ పార్కుల్లో ఒకటైన బండ్-ఈ-అమీర్ పార్కులోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ పార్క్ బమియాన్ ప్రావిన్స్ లో ఉంది. 

ఆ దేశ ధర్మం మరియు దుర్గుణం శాఖ మంత్రి మొహమ్మద్ ఖలీద్ హనాఫీ మాట్లాడుతూ.. మహిళలు సైట్ సీయింగ్ కు వెళ్లాల్సినంత అవసరం లేదని అన్నారు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు, సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని చెప్పారు. కొందరు మహిళలు హిజాబ్ ధరించడం లేదని, మరికొందరు సరైన హిజాబ్ వేసుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ మహిళలు బమియన్ స్థానికులు కాదని, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారని చెప్పారు. 

బండ్-ఈ-అమీర్ పార్క్ అత్యంత సుందరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో సరస్సులు, ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, ప్రకృతి సహజమైన అందాలు ఉన్నాయి. ఈ పార్క్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ గా పేరుగాంచింది. మరోవైపు, తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మానవ హక్కుల సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే మహిళలను తాలిబన్ ప్రభుత్వం విద్య, ఉద్యోగం, స్వేచ్ఛగా సంచరించడం, క్రీడలు వంటి వాటికి దూరం చేసిందని... ఇప్పుడు వారిని ప్రకృతికి కూడా దూరం చేస్తోందని మండిపడుతున్నాయి.

More Telugu News