Raghava Lawrence: చంద్రముఖి-2 ఆడియో లాంచ్ సందర్భంగా స్టూడెంట్ పై చేయిచేసుకున్న బౌన్సర్... వివరణ ఇచ్చిన రాఘవ లారెన్స్

  • రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి చిత్రానికి సీక్వెల్
  • పి.వాసు దర్శకత్వంలో చిత్రం
  • ఇటీవల చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం
  • జరిగిన ఘటన పట్ల వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పిన రాఘవ లారెన్స్
Raghava Lawrence apologizes for bouncer man handled a student during Chandramukhi2 audio launch

రజనీకాంత్ హీరోగా జ్యోతిక ముఖ్య పాత్రలో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా 'చంద్రముఖి-2' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఘవ లారెన్స్ హీరో. చంద్రముఖి తెరకెక్కించిన పి.వాసు ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. అయితే, ఈ కార్యక్రమం జరుగుతుండగా, వేదిక వెలుపల ఓ స్టూడెంట్ పై బౌన్సర్ చేయిచేసుకున్నట్టు తెలిసింది. దీనిపై హీరో రాఘవ లారెన్స్ వివరణ ఇచ్చారు. 

"చంద్రముఖి-2 ఆడియో లాంచ్ సందర్భంగా ఓ కాలేజ్ స్టూడెంట్ తో బౌన్సర్లలో ఒకరు బాగా గొడవపడినట్టు తెలిసింది. ఇది దురదృష్టకర ఘటన. అసలు, ఈ గొడవ జరిగింది వేదిక బయట. ఆ సమయంలో లోపల ఆడియో ఫంక్షన్ జరుగుతుండడంతో ఈ ఘటన గురించి నాకు గానీ, ఈవెంట్ నిర్వాహకులకు గానీ తెలియదు. 

విద్యార్థులను నేనెంతగా ప్రేమిస్తానో మీ అందరికీ తెలిసిందే. వారు జీవితంలో ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. నేనెప్పుడూ కూడా ఇలాంటి గొడవలకు వ్యతిరేకం. ప్రతి చోట సుఖశాంతులు ఉండాలని ఆశిస్తాను. ఈ ఘటనకు కారణం ఏమైనప్పటికీ ఒకరిని కొట్టడం అనేది తప్పు. ముఖ్యంగా అవతల ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. 

ఆడియో ఫంక్షన్ సందర్భంగా జరిగిన ఘర్షణ పట్ల వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరేది ఒక్కటే... ఇకముందు బౌన్సర్లు ఇలాంటి గొడవల జోలికి వెళ్లొద్దు... థాంక్యూ" అంటూ రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

More Telugu News