Amit Shah: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరు: అమిత్ షా

  • ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ
  • హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం
  • కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా
Amit Shah speech in Khammam

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరయ్యారు. 

ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేసినవారికి నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని అమిత్ షా మండిపడ్డారు. 

రజాకార్ల పార్టీ ఎంఐఎంతో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని స్పష్టం చేశారు. రజాకార్లతో  కేసీఆర్ రాజీ పడ్డారని, ఒవైసీతో కలిసి తెలంగాణ పోరాట యోధులను కేసీఆర్ విస్మరించారని అమిత్ షా విమర్శించారు. కేసీఆర్ పక్కన ఒవైసీ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందేనని స్పష్టం చేశారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, ఒవైసీ నడిపే కారు పార్టీని మళ్లీ గెలిపించవద్దని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారుకు తిరోగమనం ప్రారంభమైందని అన్నారు. 

కేసీఆర్, ఒవైసీలతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. బీజేపీ... ఎప్పటికైనా ఒవైసీతో పాటు వెళుతుందా... మీరే చెప్పండి! అని వ్యాఖ్యానించారు. ఒవైసీతో బీజేపీ కనీసం వేదికను కూడా పంచుకోదు అని తేల్చి చెప్పారు. 

అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టుందని, బీజేపీ శ్రేణులు అలాంటి వాటిని లెక్కచేయవని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ లను అరెస్టులతో భయపెట్టాలని చూశారని తెలిపారు. కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ధాన్యం కొనుగోలుపైనా రాజకీయాలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. మోదీ సర్కారు 9 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. 

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వికసించేది కమలమేనని అన్నారు. ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయ్యేది బీజేపీ నేత మాత్రమేనని అమిత్ షా ధీమాగా చెప్పారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని.... సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే, కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందని అమిత్ షా విమర్శించారు. 

కాంగ్రెస్ 4జీ పార్టీ అయితే, బీఆర్ఎస్ 2జీ పార్టీ అని, ఎంఐఎం 3జీ పార్టీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, బీజేపీ ఏకం అవుతాయని ఖర్గే అబద్ధాలు చెపుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఇక, కోర్టులో పోరాటం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అరుణకు ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు.

More Telugu News