Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

  • ఖమ్మంలో రైతు గోస- బీజేపీ భరోసా సభ
  • హాజరైన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
  • కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యం అయిందని వెల్లడి
  • తూతూ మంత్రంగా రుణమాఫీలు చేస్తున్నారని ఆగ్రహం
  • బీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శలు
Kishan Reddy said BRS Party works for only Kalvakuntla family

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో కల్తీ విత్తనాలు పెరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని నిలదీశారు. రైతులకు ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యం అయిందని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడంలేదని తెలిపారు. పావలా వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇవ్వడంలేదని, పంట బీమా అమలు చేయడంలేదని ఆరోపించారు. వరి వేయొద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోందని కిషన్ రెడ్డి అన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని, రైతులకు మద్దతు పలికేందుకు అమిత్ షా వచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News