Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి: అశోక్ గెహ్లాట్

  • కూటమిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామన్న గెహ్లాట్
  • ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలే ప్రభావం చూపిస్తాయన్న రాజస్థాన్ సీఎం
  • 31 శాతం ఓట్లతో గెలిచిన మోదీకి అహంకారం తగదని హితవు
  • వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో అధికారంలోకి రావాలన్న మోదీ ఆశలు నెరవేరవన్న సీఎం 
Rahul Gandhi is Congress PM candidate for 2024 Lok Sabha polls Says Ashok Gehlot

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు పూర్తిగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని పార్టీలపైనా తీవ్ర ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రజలే అటువంటి పరిస్థితి తీసుకొచ్చారని, దాని ఫలితమే అన్ని పార్టీల కూటమి అని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహంకారంతో వ్యవహరించకూడదని, ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని, మిగిలిన 69 శాతం ఆయనకు వ్యతిరేకమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. గత నెలలో బెంగళూరులో ఇండియా కూటమి సమావేశమైనప్పుడు ఎన్డీయే భయపడిందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలపై గెహ్లాట్ మాట్లాడుతూ.. మోదీకి అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఆయన పాప్యులారిటీ పతాకస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన 50 శాతం ఓట్లు సాధించలేకపోయారని అన్నారు. ఆయన ఓట్ల షేర్ పడిపోతుందని, 2024 ఎన్నికల ఫలితాలు ప్రధాని ఎవరు కావాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారానే 2014 ఎన్నికల్లో మోదీ అధికారంలోకి వచ్చారని అన్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నాటి కృషి కారణంగానే నేటి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైందని రాజస్థాన్ సీఎం పేర్కొన్నారు.

More Telugu News