Chandrababu: ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి ప్రజలు రుణపడి ఉండాలట!: చంద్రబాబు

Chandrababu take a dig at YCP leaders
  • టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు
  • జగన్ ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని విమర్శలు
  • మరో ఆర్నెల్లలో జగన్ ఇంటికి పోవడం ఖాయమని వెల్లడి
  • హామీల అమలుపై వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టీకరణ
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని అన్నారు. మరో 6 నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలిపారు. 

98 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పథకాల్లో కోతలు విధించి కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రజలపై రూ.50 వేల కోట్ల విద్యుత్ భారం మోపారని తెలిపారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి ప్రజలు రుణపడి ఉండాలట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏమిటో ప్రజలకు చెప్పాలని టీడీపీ శ్రేణులకు నిర్దేశించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏం నష్టపోయారో ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక చేతివృత్తులు, కులవృత్తులకు అండగా ఉంటామని తెలిపారు. పేదలను ధనికులుగా మార్చడమే తమ పూర్ టు రిచ్ కార్యాచరణ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. బాబు ష్యూరిటీ... భవిష్యత్తుకు గ్యారెంటీ అనేదే మన నినాదం అని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. నిన్నిక భరించలేం... బై బై జగన్... ఇదే అందరి నినాదం ఆవాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 28 నుంచి ఆందోళనలు చేపడుతున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. జగన్, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ రూ.40 వేల కోట్ల విలువైన ఇసుకను దోచేశారని ఆరోపించారు. 

ఇక, టీటీడీ బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తారా? అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారడమంటే తప్పు చేశానని ఒప్పుకోవడమే కదా అని అన్నారు. అలాంటప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పించారని చంద్రబాబు నిలదీశారు. టీటీడీలో నియామకాలు సహా జగన్ చేసే తప్పులన్నీ ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు స్పష్టం చేశారు. 

ఇటీవల జరిగిన పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో 92 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు.
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News