Narendra Modi: గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చిన మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగం

  • చంద్రయాన్-3 ల్యాండింగ్ రోజున విదేశాల్లో ఉన్న మోదీ
  • విదేశాల్లో ఉన్నప్పటికీ ఆ రోజున తన మనసు ఇక్కడే ఉందని భావోద్వేగం
  • మన దేశ గౌరవం ఈ రోజున చంద్రుడిపై ఉందని సగర్వంగా చెప్పిన ప్రధాని
PM Modi gets emotional while talking to ISRO scientists

చంద్రయాన్-3 సక్సెస్ తో మన దేశ ఖ్యాతి అందనంత ఎత్తుకు చేరుకుంది. ప్రపంచ అగ్ర దేశాలు సైతం ఈర్ష్య పడేలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా అప్పుడే చంద్రుడిపై తన పని ప్రారంభించింది. మన రోవర్ పంపించే అత్యంత కీలకమైన డేటా కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 ల్యాండింగ్ రోజున బ్రిక్స్ సమ్మిట్ కోసం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన గ్రీస్ పర్యటనకు వెళ్లారు. గ్రీస్ నుంచి ఆయన ఢిల్లీకి కాకుండా, నేరుగా బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, చంద్రయాన్-3 ల్యాండింగ్ రోజున తాను విదేశాల్లో ఉన్నప్పటికీ తన మనసు మాత్రం ఇక్కడే ఉందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చి మిమ్మల్ని కలవకుండా ఉండలేకపోయానని చెప్పారు. మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.  

ఇప్పుడు ఇండియా చంద్రుడిపై ఉందని మోదీ సగర్వంగా చెప్పారు. మన దేశ గౌరవం ఇప్పుడు చంద్రుడిపై ఉందని అన్నారు. భారత దేశ అంతరిక్ష రంగ చరిత్రలో చంద్రయాన్-3 సక్సెస్ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని చెప్పారు. అంగదుడి మాదిరి చంద్రుడిపై మన మూన్ ల్యాండర్ అడుగు పెట్టిందని అన్నారు.

చంద్రుడిపై మన ల్యాండర్ విజయవంతంగా అడుగు పెట్టిన క్షణాన ఇస్రో సెంటర్ లో మన శాస్త్రవేత్తలు ఎలా కేరింతలు కొట్టారో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నారని మోదీ చెప్పారు. ఇస్రో సాధించిన ఘనతతో మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ ను నమ్మేవారు, భవిష్యత్తు గురించి ఆలోచించేవారు అందరూ భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. సాంకేతిక రంగంలో మన దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో ఈరోజు యావత్ ప్రపంచం చూస్తోందని చెప్పారు.

More Telugu News