Narendra Modi: ఏథెన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం

PM Modi gets grand welcome in Athens
  • దక్షిణాఫ్రికాలో ముగిసిన బ్రిక్స్ సమావేశాలు
  • గ్రీస్ పర్యటనకు తరలివెళ్లిన ప్రధాని మోదీ
  • 40 ఏళ్ల తర్వాత గ్రీస్ లో అడుగుపెట్టిన ఓ భారత ప్రధాని
  • గ్రీస్ దేశాధ్యక్షురాలు, ప్రధానితో మోదీ సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్ తరలి వెళ్లారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్లకార్డులు చేతపట్టుకుని భారత సంతతి పౌరులు విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటాకిస్ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు. 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. 

కాగా, తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గ్రీస్ దేశాధ్యక్షురాలు కేథరినా సకెల్లారోపౌలోవ్ తో సమావేశమయ్యారు. భారత్-గ్రీస్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. సుస్థిర అభివృద్ధిపై ఆలోచనలను పంచుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రయాన్-3 సక్సెస్ పై గ్రీస్ దేశాధ్యక్షురాలు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇది కేవలం భారత్ విజయం మాత్రమే కాదని, ఇది యావత్ మానవాళి సాధించిన విజయంగా తాము భావిస్తున్నామని మోదీ ఆమెతో చెప్పారు. చంద్రయాన్-3 ద్వారా సేకరించే డేటా శాస్త్రవేత్తలందరికీ, మానవాళి మొత్తానికి ఉపయోగపడనుందని తెలిపారు. 

ఇక, గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటాకిస్ తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢతరం చేసే దిశగా వీరి మధ్య చర్చలు సాగాయి.
Narendra Modi
Athens
Greece
India

More Telugu News