Talasani: ఆ రోజు ఆ వ్యక్తి నా కాలు తొక్కడంతో రక్తం వచ్చింది... అందుకే అతడిని నెట్టివేశాను: మంత్రి తలసాని

Talasani gives explanation on steel bridge opening ceremony incident
  • ఇటీవల హైదరాబాదులో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
  • హాజరైన మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని తదితరులు
  • ఓ వ్యక్తిపై తలసాని చేయి చేసుకున్న దృశ్యాలు వైరల్
  • ఆ వ్యక్తి భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ కుమార్ బాబు అని తలసాని వెల్లడి
  • అతడికి సారీ చెప్పానంటూ వివరణ
ఇటీవల హైదరాబాదులో మంత్రి కేటీఆర్ పాల్గొన్న స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ వ్యక్తిని నెట్టివేసి, చేయి చేసుకున్న దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

"ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం రోజున కేటీఆర్ గారు వచ్చిన సందర్భంగా విపరీతమైన రద్దీ ఏర్పడింది. మేం నడుస్తుండగా ఓ వ్యక్తి నా కాలు తొక్కుకుంటూ ముందుకు వెళ్లాడు. నా కాలుకు గాయమై రక్తం వచ్చింది... ఈ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టివేశాను. కానీ, సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. 

అతను భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసింది. ఆయన గిరిజన బిడ్డ... వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పాను. అయినప్పటికీ, నాపై కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

నేను బడుగు బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల గొంతుకను. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలను ముందుండి చేయించే వ్యక్తిని. ఆ రోజున జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ చెబుతున్నా" అంటూ సంజాయిషీ ఇచ్చారు.
Talasani
Man Handling
Steel Bridge Opening
BRS
Hyderabad
Telangana

More Telugu News