IIT Bombay: ఐఐటీ బాంబేకు రూ.160 కోట్ల విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి.. ప్రచారం కోరుకోని దాత!

  • దాత తన పేరు వెల్లడించవద్దని కోరాడన్న డైరెక్టర్ సుభాసిస్ చౌదరి
  • ఇంత పెద్ద విరాళం ఇస్తూ బయటకు చెప్పుకోకపోవడం ఇదే ప్రథమమని వెల్లడి
  • గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటుకు వెచ్చిస్తామని వివరణ
IIT Bombay received 160 crore donation from anonymous donor

దేశంలోనే పేరొందిన ఐఐటీ బాంబేకు పూర్వ విద్యార్థి ఒకరు భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. రూ.160 కోట్లకు చెక్ రాసి పంపించాడని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి పేర్కొన్నారు. అయితే, తన పేరు వెల్లడించవద్దని దాత కోరడంతో వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందని చెప్పారు. ఈ మొత్తాన్ని గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటుకు వెచ్చిస్తామని వివరించారు. ఐఐటీ బాంబేకు ఇచ్చే విరాళం సరైన పనికి ఉపయోగపడుతుందని సంస్థ పూర్వ విద్యార్థులతో పాటు అందరికీ తెలుసని డైరెక్టర్ చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి కూడా ప్రచారం కోరుకోకపోవడం దాతకున్న గొప్ప మనసును చాటుతోందని ప్రశంసించారు. బహుశా యూనివర్సిటీ అందుకున్న డొనేషన్లలో ప్రచారం కోరుకోని వ్యక్తి ఈ దాత మాత్రమే కావొచ్చని చెప్పారు.

ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కూడా ఇటీవల ఐఐటీ బాంబేకు రూ.315 కోట్ల విరాళం అందించారు. నందన్ నీలేకని 1973లో ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని అందించారు. ఐఐటీ బాంబే ఇప్పటివరకు అందుకున్న విరాళాల్లో ఇదే భారీ మొత్తం కావడం విశేషం. గతంలోనూ నీలేకని రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో ఐఐటీ బాంబేకు నీలేకని ఇచ్చిన మొత్తం విరాళం రూ.400 కోట్లు అని డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి తెలిపారు.

More Telugu News