Vladimir Putin: నమ్మకద్రోహాన్ని ఎన్నటికీ క్షమించలేను.. 2018 ఇంటర్వ్యూలో పుతిన్ వ్యాఖ్య.. వీడియో ఇదిగో!

  • ప్రిగోజిన్ మరణం నేపథ్యంలో వైరల్ గా మారిన వీడియో
  • ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్న పూర్తిగా అడగకముందే జవాబిచ్చిన పుతిన్
  • రష్యాలో పుతిన్ విమర్శకులు అకస్మాత్తుగా చనిపోతుంటారన్న ఫ్రాన్స్ మంత్రి
Betrayal is Impossible To Forgive says Putin In 2018

వాగ్నర్ చీఫ్ యెవెగని ప్రిగోజిన్ మరణంపై రష్యాతో పాటు ప్రపంచ దేశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా రష్యా అధ్యక్షుడి పాత ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2018లో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం తీసిన వీడియోలో పుతిన్ మాట్లాడిన క్లిప్ ఇది. ఇందులో పుతిన్ ను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నలు అడుగుతుండగా.. పుతిన్ వాటికి జవాబివ్వడం కనిపిస్తోంది.
పది సెకన్ల ఈ వీడియో సంభాషణలో..
ఇంటర్వ్యూయర్: ‘మీ చుట్టూ ఉన్న వాళ్లు చేసే తప్పులు లేదా పొరపాట్లను క్షమించగలరా?’ 
పుతిన్: ఓ క్షణం మౌనం తర్వాత ‘అవును.. క్షమిస్తాను’ ఆ వెంటనే ‘అయితే అన్నింటినీ కాదు’
ఇంటర్వ్యూయర్: మీరు ఎన్నటికీ క్షమించలేనని భావించే విషయం ఏమిటి?
పుతిన్: ‘నమ్మకద్రోహం’
(ఇంటర్వ్యూయర్ ప్రశ్న పూర్తిగా అడగకముందే పుతిన్ జవాబిచ్చారు)

రష్యా గూఢచారిగా, కేజీబీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి పుతిన్ గురించి తెలిసిన వారు కూడా ఆయన గురించి ఇదేమాట చెబుతుంటారు. నమ్మకద్రోహాన్ని పుతిన్ ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించలేడని, ప్రతీకారం తీర్చుకుంటాడని సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్పారు. వాగ్నర్ చీఫ్ విమాన ప్రమాదంలో మరణించడం వెనక పుతిన్ హస్తం ఉందని పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

‘క్షమించడం.. మరచిపోవడం’.. ఈ రెండు పదాలు పుతిన్ డిక్షనరీలోనే లేవని బ్రిటిష్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ బిల్ బ్రౌడర్ చెప్పారు. బ్రౌడర్ ఒకప్పుడు రష్యాలోని చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. అయితే, పుతిన్ పై చేసిన విమర్శల కారణంగా తన ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భయపడి రష్యా నుంచి బ్రిటన్ కు తిరిగొచ్చేశారు. ప్రిగోజిన్ మరణంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ పుతిన్ గురించి చెప్పారు. పుతిన్ ఎన్నటికీ, ఎవరినీ క్షమించలేడని, దేనినీ మరిచిపోడని వివరించారు. 

పుతిన్ బలహీనతలను బయటి ప్రపంచానికి చూపెట్టడం ద్వారా ప్రిగోజిన్ సరిదిద్దుకోలేని తప్పుచేశారని వ్యాఖ్యానించారు. తన విమర్శకులను, శత్రువులను పుతిన్ అత్యంత తెలివిగా తుదముట్టిస్తాడని అన్నారు. పైకి ప్రమాదంలా కనిపించే ఈ మరణాలపై ‘విచారణ జరిపిస్తాం’ అని చెప్పి పుతిన్ చేతులు దులుపుకుంటారని వివరించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ పుతిన్ తన మనసులో బహుశా ‘నమ్మకద్రోహులకు ఇదే సరైన శిక్ష’ అని అనుకుంటూ ఉంటారని బ్రౌడర్ చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. రష్యాలో పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు అకస్మాత్తుగా చనిపోతుంటారని, అది కూడా ప్రమాదవశాత్తూ జరిగినట్లు ఉంటుందని అన్నారు.

More Telugu News