Dr BR Ambedkar Konaseema District: తేలు కుట్టడంతో రక్తపు వాంతులు.. విద్యార్థి మృతి!

  • డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘటన 
  • తరగతిలో చాక్లెట్ రేపర్లు బయట పారేస్తుండగా విద్యార్థిని కుట్టిన తేలు
  • ఊపిరితిత్తుల్లో విషం చేరి విద్యార్థి మృతి
Ap student dies after scorpion bite

తరగతి గదిలో తేలు కుట్టడంతో ఓ విద్యార్థి రక్తపు వాంతులు చేసుకుని దుర్మరణం చెందాడు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల చిన్నకుమారుడు అభిలాష్ (14) వాకతిప్ప జడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వలస కూలీ అయిన అతడి తండ్రి వరంగల్‌లో పనిచేస్తుండగా, తల్లి కువైట్‌లో పనిచేస్తోంది. అభిలాష్ తన తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. 

కాగా, గురువారం అతడు తన స్నేహితుడితో కలిసి క్లాస్ రూంలో పడి ఉన్న చాక్లెట్ రేపర్లు ఏరుతుండగా తేలు కుట్టింది. వెంటనే ఉపాధ్యాయులు అతడిని స్థానిక పీహెచ్‌సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తరువాత మెరగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే, ఉపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థి మృతిచెందాడు. ఘనటపై కేసు నమోదు చేసుకున్న అంగర ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News