Siddipet District: భార్యతో గొడవ.. కౌన్సెలింగ్‌కు రమ్మంటూ పోలీసుల పిలుపు.. భయంతో టెకీ ఆత్మహత్య

  • సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఘటన
  • టెకీకి రెండు నెలల క్రితమే వివాహం, పెళ్లయిన నాటి నుంచే భార్యతో విభేదాలు
  • 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన టెకీ 
  • భర్తపై భార్య గోదావరిఖని ఠాణాలో ఫిర్యాదు
  • కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటూ టెకీకి పోలీసుల నుంచి పిలుపు 
  • భయపడిపోయిన టెకీ రంగనాయక రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య 
Siddipet Techie commits suicide after police call him from counselling in marital dispute

భార్యతో వివాదం కారణంగా కౌన్సెలింగ్‌కు రావాలని పోలీసుల నుంచి పిలుపందడంతో భయపడిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు గోదావరిఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన నెల నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో కిరణ్ 15 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో నార్సింగి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. మరోవైపు, గోదావరి ఖని ఠాణాలో అశ్విని తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కిరణ్‌ను బుధవారం కౌన్సెలింగ్‌కు రమ్మని పిలిచారు. 

కాగా, మంగళవారం సాయంత్రం తన మేనమామ కొడుకు నరేందర్‌తో కలిసి కిరణ్ రంగనాయక సాగర్ జలాశయానికి వెళ్లాడు. నరేందర్ ఫోను తీసుకొని మరో వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించిన కిరణ్ నరేందర్‌ను కాస్తంత దూరంలో నిలబడాలని కోరాడు. ఈ క్రమంలో నరేందర్ దూరంగా వెళ్లిన కాసేపటికి వెనక్కు తిరిగి చూస్తే కిరణ్ కనిపించలేదు. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం ఉదయం జలాశయంలో కిరణ్ మృతదేహం తేలియాడుతూ పర్యాటకులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News