Medchal: మద్యం మత్తులో యువకుల వీరంగం.. ఎస్సైపై దాడి

  • మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఎస్సై ఐడీ కార్డు, ఫోన్ లాక్కుని పరార్
  • యువకులపై స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎస్సై
Medchal youth assaulted on SI in uniform

విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఎస్సైపై నలుగురు యువకులు దాడి చేశారు. ఐడీ కార్డుతో పాటు ఎస్సై ఫోన్ ను లాక్కుని పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

బాలనగర్ ఎస్ ఓటీ ఎస్సై కిశోర్ బుధవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కొంపల్లి సర్వీస్ రోడ్డుపై కారును ఓ యువకుడు అడ్డగించాడు. ఇంత వేగంగా ఎందుకు వెళుతున్నావని, నెమ్మదిగా వెళ్లాలని ఎస్సై కిశోర్ ను దబాయించాడు. దీంతో కారును పక్కకు ఆపిన కిశోర్.. తాను ఎస్ ఓటీ ఎస్సైనని, కారు ఎందుకు ఆపావని నిలదీశాడు. కిశోర్ ప్రశ్నించడంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తన స్నేహితులను పిలిచి ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు.

‘నువ్వు ఎస్సై అయితే నాకేంటి.. మార్ డాలూంగా’ అంటూ హెచ్చరించాడు. ఆపై నలుగురు యువకులు ఎస్సై కిశోర్ ను గాయపరిచారు. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకోవడంతో కిశోర్ ఐడీ కార్డు, ఫోన్ లాక్కుని పారిపోయారు. ఆ సమయంలో యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. తనపై దాడికి పాల్పడ్డ యువకుల వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎస్సై కిశోర్.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో షేక్ ఇర్ఫాన్, జుబేర్, జావిద్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News