Narendra Modi: దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ ను ఎలా వీక్షించబోతున్నారంటే..?

  • సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్
  • బ్రిక్స్ సమ్మిట్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ
  • ల్యాండింగ్ ప్రక్రియను వర్చువల్ గా వీక్షించనున్న ప్రధాని
How PM Modi going to watch Chandrayaan 3 landing event from South Africa

మన దేశంలో ని కోట్లాది మంది ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ తుది అంకానికి చేరుకుంది. అంతా సవ్యంగా కొనసాగితే ఈ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ల్యాండ్ అవుతాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు చంద్రయాన్ సక్సెస్ కావాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఈ మిషన్ సక్సెస్ కావాలని పాకిస్థాన్ ప్రజలు సైతం కోరుకుంటున్నారంటే... ప్రపంచమంతా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తోందో అర్థమవుతుంది. 

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. 15వ బ్రిక్స్ సమ్మిట్ కోసం ఆయన మూడు రోజుల పర్యటనకు గాను అక్కడకు వెళ్లారు. చంద్రుడిపై మనం అడుగుపెట్టి, ప్రపంచానికి మన సత్తా ఏంటో తెలియజేయాలనే పట్టుదలతో ఆయన తొలి నుంచి కూడా ఉన్నారు. 2019 సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ను ల్యాండింగ్ ను వీక్షించేందుకు ఆయన బెంగళూరులోని ఇస్రో సెంటర్ కు వెళ్లారు. అయితే, అప్పడు విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో, యావత్ దేశం ఎంతో నిరాశకు గురయింది. అప్పటి ఇస్రో చీఫ్ కె.శివన్ ఆవేదనను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న దృశ్యం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో ఆయనను స్వయంగా మోదీ ఓదార్చారు. మనం ఫెయిల్ కాలేదని... చంద్రుడిని ముద్దాడాలన్న మన ఆకాంక్ష మరింత బలపడిందని ఆ సందర్భంగా మోదీ అన్నారు. 

మరోవైపు, దక్షిణాఫ్రికాలో ఉన్న మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కీలక ఘట్టాన్ని ఎలా వీక్షించబోతున్నారనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. సౌతాఫ్రికా నుంచే ఆయన వర్చువల్ గా ల్యాండింగ్ ను వీక్షించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇంకోవైపు, ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అయితే ఈ దేశాలన్నీ తమ రోవర్లను ఉత్తర ధ్రువం మీద దించాయి. చంద్రయాన్-3 సక్సెస్ అయితే... చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.

More Telugu News