Cable Car Ordeal: కేబుల్ కారులో చిక్కుకున్న చిన్నారుల సురక్షితం.. 15 గంటల హారర్‌కు శుభం కార్డు

  • ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఘటన
  • చిన్నారులు స్కూలుకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోయిన కేబుల్ కారు
  • భూమికి 1200 అడుగుల ఎత్తులో వేలాడిన వైనం
  • మిలటరీ, రెస్క్యూ సిబ్బంది, స్థానికుల సాయంతో క్షేమంగా బయపటపడిన చిన్నారులు
  • సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశామన్న ఆర్మీ
Pakistan cable car ordeal ends after over 15 hours all 8 are rescued

పాకిస్థాన్‌లో కేబుల్ కారులో చిక్కుకున్న చిన్నారులు 15 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. 15 గంటల ప్రయత్నం తర్వాత ఏడుగురు చిన్నారులు, ఓ వ్యక్తిని సురక్షితంగా రక్షించగలిగారు. చిన్నారులందరూ 10 నుంచి 15 ఏళ్లలోపు వారే. ఆహారం, నీళ్లు లేక వారంతా నీరసించిపోయినట్టు అధికారులు తెలిపారు. స్కూలుకు వెళ్లేందుకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని లోయను దాటుతున్న సమయంలో కేబుల్ కారు మధ్యలో ఆగిపోయింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులు సహా 8 మంది 1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. అందులోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు.

రోజంతా వేలాడుతూ ఉన్న కారులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన చిన్నారులను రక్షించే ప్రయత్నాలు మొత్తానికి చిమ్మ చీకట్లో రాత్రివేళ పూర్తయ్యాయి. పిల్లలను సురక్షితంగా రక్షించినట్టు తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ తెలిపారు. మిలటరీ, రెస్క్యూ విభాగం, జిల్లా అధికారులు, స్థానిక ప్రజలు సంయుక్తంగా చిన్నారులను రక్షించినట్టు పేర్కొన్నారు. 

కేబుల్ కారులో చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్నారులను రక్షించిన తర్వాత రాత్రి పొద్దుపోయాక సైనిక హెలికాప్టర్ ఆపరేషన్ నిలిపివేసింది. ఆ తర్వాత ఫ్లైడ్‌లైట్లు ఏర్పాటు చేసి కింది నుంచి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కేబుల్ క్రాసింగ్ నిపుణులు కేబుల్ వెంట ఉన్న చిన్న ఫ్లాట్‌ఫామ్‌లోకి చిన్నారులను చేర్చడం ద్వారా ఒక్కొక్కరినీ కిందికి దించారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను ఆర్మీ విజయవంతంగా పూర్తిచేసిందని సైన్యం తెలిపింది.

More Telugu News