cpi: మేం లేకుంటే మునుగోడులో మీ పరిస్థితి ఏమయ్యేది?: కేసీఆర్ కు సీపీఐ నేత కూనంనేని ప్రశ్న

  • బీజేపీ దూకుడు అడ్డుకోవడానికే అప్పట్లో తాము మద్దతిచ్చామన్న కూనంనేని 
  • బీజేపీకి దగ్గరైతే మిత్రధర్మం పాటించాలి కదా అని హితవు
  • మునుగోడులో బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ ప్రమాదంలో పడేవారు కాదా? అని ప్రశ్న
  • లెఫ్ట్ పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వెల్లడి
Kunamneni Sambasiva Rao questions CM KCR over alliance

కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమయ్యేదో అందరికీ తెలుసునని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ... మునుగోడులో కేసీఆర్ తమ మద్దతు కోరారని చెప్పారు. బీజేపీ దూకుడును అడ్డుకోవాలని తాము బీఆర్ఎస్‌కు అండగా నిలిచినట్లు చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో తాము, లెఫ్ట్ పార్టీలు కలిసి ఉంటామ ని కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు.

కేసీఆర్ రైతు సమస్యలపై కూడా తమతో చర్చించారన్నారు. కేసీఆర్‌కు ఉత్సాహం వచ్చినప్పుడు తమకు ఫోన్లు చేశారన్నారు. ఆ తర్వాత ఏమైందో తమకు తెలియదన్నారు. కానీ మునుగోడులో లెఫ్ట్ లేకుంటే బీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మీరు ప్రమాదంలో పడేవారు కాదా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఎంతబేరసారాలు జరిగాయో తెలియదా? అన్నారు. బీజేపీతో కేసీఆర్‌కు సఖ్యత కుదిరినట్లుగా కనిపిస్తోందన్నారు. బీజేపీకి దగ్గరైతే కనీసం మిత్రధర్మం పాటించాలి కదా అన్నారు. బీజేపీ అండదండలు ఉంటే చాలనుకుంటున్నట్లుగా ఉందన్నారు.

నిన్న లెఫ్ట్ పార్టీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఏదేమైనా వచ్చే ప్రభుత్వంలో తాము నిర్ణయాత్మకంగా మారుతామన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు చెడినప్పటికీ వ్యక్తిగతంగా దూషించమని, విధానపరంగా మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు.

More Telugu News