Anand Mahindra: చింపాంజీకి ఎంత తెలివి ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..!

  • దాహం వేస్తే నీరు తాగేందుకు వ్యక్తి సాయం
  • తనకు నీరు పట్టించిన వ్యక్తి చేతులను కడిగిన చింపాంజీ
  • ఇందులో మంచి సందేశం ఉందన్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Shares Clip Of Chimpanzee Washing A Photographers Hands

మనిషికి మాదిరే తెలివితేటల్లో చింపాంజీలు ముందుంటాయి. వాటి చర్యలను చూస్తే ఇదే అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ చింపాంజీ తనకు దాహం వేస్తుండడంతో నీళ్లు పట్టించాలంటూ తన దగ్గరకు వచ్చిన ఫొటోగ్రాఫర్ ను అడుగుతుంది. అతడి రెండు చేతులనూ పట్టుకుని దోసిలిగా నీళ్లను ఒడిసి పట్టి తాగుతుంది.

తాగడం అయిపోయిన తర్వాత అది చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. పారే నీటితో ఆ వ్యక్తి రెండు చేతులను కడుగుతుంది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను సైతం ఆకర్షించింది. దీంతో ఆయన ఎక్స్ ప్లాట్ ఫామ్ పై దీన్ని రీపోస్ట్ చేశారు. 

ఈ క్లిప్ గత వారం ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. కామెరూన్ లో ఓ చింపాంజీ నీటిని తాగేందుకు ఓ ఫొటోగ్రాఫర్ సాయాన్ని అడుగుతుంది. తర్వాత తన వంతు సాయంగా అతడి చేతులను మెల్లగా కడుగుతుంది. ఇందులో ఓ మంచి పాఠం ఉంది. నీవు సక్సెస్ కావాలంటే నీ సమాజంలో, పని చేసే చోట అవసరమైన వారికి సాయం అందించు. అప్పుడు వారు నీకు మద్దతుగా నిలుస్తారు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

More Telugu News