Chiranjeevi: మెగా బాస్ .. మెగా మాస్

  • గట్టి పోటీలో ఎంట్రీ ఇచ్చిన చిరూ 
  • డాన్స్ లో .. ఫైట్స్ లో తనదైన మార్క్ 
  • కాస్ట్యూమ్స్ పరంగాను కొత్త ట్రెండ్
  • దశాబ్దాలుగా ఆగని ప్రయాణం
  • ఎంతోమందికి ఆయన ఓ నిలువెత్తు నిఘంటువు
Chiranjeevi Special

చిరంజీవి .. ఈ పేరు చూపించిన ప్రభావం ... అది చేసిన ప్రభావితం అంతా ఇంతా కాదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎవరెస్టు మాదిరిగా ఎదుగుతూ వెళ్లిన శిఖరం పేరు ఇది. ఏదో ఒక మైనస్ ను అంటగట్టేసి ఇంటికి పంపించే ప్రయత్నాలు చేసే ఈ ఫీల్డులో, ఎదురు నిలబడటం .. ఓటములపై తిరగబడటం ఎంత కష్టమో కొంతమందికి మాత్రమే తెలుసు. అలాంటి ఇండస్ట్రీలోకి ఒంటరిగా అడుగుపెట్టి వటవృక్షమై ఎదిగిన చిరంజీవి పుట్టినరోజు .. ఈ రోజు. 

ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున ఏఎన్నార్. అలాగే కృష్ణ - శోభన్ బాబు సమాంతరంగా దూసుకుపోతున్న సమయంలో చిరంజీవి వచ్చారు. ఇక తమిళంతో పాటు తెలుగును కూడా రజనీకాంత్ - కమల్ ప్రభావితం చేస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిరంజీవి, ప్రతి అంశంలో కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ దూసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోవడానికి ఆలస్యం చేయలేదు. 

డాన్సులలో .. ఫైట్లలో చిరంజీవి కొత్త ట్రెండ్ కి తెరతీశారు. ఆయన ఫైట్ చేస్తుంటే నిజంగానే విరుచుకుపడుతున్నట్టుగా ఉంటుంది. ఇక డాన్సులలో స్టెప్స్ ను .. ఎక్స్ ప్రెషన్ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలోనే చిరంజీవి సక్సెస్ అయ్యారు. కామెడీలోను ఆయన విజృంభించారు ..  మాస్ పాత్రలలో చెలరేగిపోయారు. కాస్ట్యూమ్స్ లో కొత్తదనానికి నాంది పలికారు. అంతకుముందున్న హీరోల వైపు నుంచి ఏదైతే వెలితి ఉందో .. ఆ వెలితిని అన్ని వైపుల నుంచి పూడ్చేస్తూ వెళ్లే విషయంలోనే చిరంజీవి తనకి తిరుగులేదనిపించుకున్నారు. 

చిరంజీవి ప్రతి కదలికలోను ఒక స్టైల్ ఉంటుంది. నడకలోను .. నవ్వులోను .. మాటలోను అది కనిపిస్తూనే ఉంటుంది. చిరంజీవి ఎంట్రీ ఇచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికీ, ఆయనను దాటుకుని వెళ్ళినవారు కాదు గదా .. దరిదాపుల్లోకి వచ్చినవారు కూడా ఎవరూ లేరు. తనదైన ముద్రను ఆయన అంత గాఢంగా వేయగలిగారు. ఒక రజనీ .. ఒక కమల్ కలిస్తే ఒక చిరంజీవి అని బాలచందర్ వంటి గొప్ప దర్శకుడు అన్నారంటే, మెగాస్టార్ ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News