Mumbai: ఎయిడ్స్ ఉందంటూ రక్తం కక్కుకుని లైంగికదాడి నుంచి తప్పించుకున్న మహిళ

  • ముంబైలోని బోరీవలీ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
  • ఆగంతుకుడు అర్ధరాత్రి తన ఇంట్లోకి వచ్చి లైంగిక దాడి చేయబోయాడంటూ మహిళ ఫిర్యాదు
  • తనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిదంటూ రక్తం కక్కుకోవడంతో పారిపోయాడని వెల్లడి
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
Woman feigns AIDS to save herself from getting molested drives out intruder lodges police complaint

ఓ ఆగంతుకుడు తనపై లైంగిక దాడి చేయబోగా ఎయిడ్స్ ఉందని నటించి తప్పించుకున్నానంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, బోరీవలీ ప్రాంతంలో 53 ఏళ్ల ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త కొంతకాలం క్రితం మరణించారు. కూతురు, అల్లుడు విదేశాల్లో నివసిస్తుంటారు. స్థానికంగా ఉన్న ఓ భవంతి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆమె ఉంటోంది. 

ఇటీవల ఓ రోజు రాత్రి 2.00 గంటల సమయంలో ఆమె నిద్రపోతుండగా సుమారు 25 ఏళ్ల వయసున్న ఓ ఆగంతుకుడు కిటికీ గ్రిల్స్ తొలగించి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళకు మెలకువ రావడంతో ఎందుకొచ్చావంటూ ఆ ఆగంతుకుడిని ప్రశ్నించింది. దొంగతనానికి వచ్చానని అతడు సమాధానం ఇవ్వడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అయితే, అతడు ఆమెపై లైంగిక వేధింపులకు దిగడంతో తనకు ఎయిడ్స్ ఉందని నటిస్తూ అతడి ముందు రక్తం కక్కుకుంది. దీంతో, భయపడిపోయిన నిందితుడు ఇంటి ప్రధాన ద్వారం గుండా వెళ్లిపోతూ, బయట గడియపెట్టేశాడు. దీంతో ఆమె పోరుగువారిని పిలిచి తలుపు తీయించుకుంది. ఈ మేరకు బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని మీడియాకు తెలిపారు. ఆ భవంతిలో వాచ్‌మెన్ ఎవరూ లేరని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇరుగుపొరుగును ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News