Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్

Pawan kalyan wishes Chiranjeevi birth day
  • మీ తమ్ముడిగా పుట్టి అన్నయ్య అని పిలిచే అదృష్టం కలిగిందన్న జనసేనాని
  • లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచారని కితాబు
  • మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో 'అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు.

'అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా... కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య' అంటూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Chiranjeevi
Tollywood

More Telugu News