rani rudrama: ఈ జాబితా చూశాక కల్వకుంట్ల కవిత క్షమాపణ చెప్పాలి: రాణి రుద్రమ

  • 119 స్థానాల్లో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే టిక్కెట్ ఇచ్చారన్న బీజేపీ నేత
  • ఇక మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని విమర్శ
  • కమిటీల్లో 30 శాతం రిజర్వేషన్ ఇస్తోన్న బీజేపీ మీద కవిత పోరాటం సిగ్గుచేటు అని వ్యాఖ్య
  • మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చించి పారేసిన పార్టీలతో అంటకాగుతున్నారని ఆరోపణ
  • ప్రగతి భవన్ ముందు కవిత ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్న
Rani Rudrama demands apology from Kavitha

బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా ఆడారనేది ఈ జాబితాతో వెల్లడైందన్నారు. 119 స్థానాల్లో ఏడుగురు మహిళలకే టిక్కెట్లు ఇచ్చారని, కాబట్టి వారికి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదన్నారు.

ఓపక్క జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు బీఆర్ఎస్ పార్టీ 3 శాతం టిక్కెట్లు ఇస్తూ, మరోపక్క దేశవ్యాప్తంగా పార్టీ కమిటీలలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ ఇస్తోన్న బీజేపీ మీద పోరాటం చేస్తామనడం సిగ్గుచేటు అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేసిన కవిత ఇప్పుడు ప్రగతి భవన్ ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీయే ప్రభుత్వమేనని, వరుసగా నాలుగుసార్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. త్వరలో ఈ చట్టాన్ని తీసువచ్చేది కూడా తమ ప్రభుత్వమే అన్నారు.

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చించి పారేసిన పార్టీలతో అంటకాగుతూ, సొంత పార్టీలో ఏ ఒక్క కమిటీలో మహిళలకు స్థానం ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ కథను, ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్షను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. పట్టుమని పదిమందికి కూడా టిక్కెట్ ఇవ్వనప్పటికీ... ఉరికి ఉరికి కవిత ధర్నాలో కూర్చున్న నాయకులంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

More Telugu News