Southern California: అటు హరికేన్... ఇటు భూకంపం... దక్షిణ కాలిఫోర్నియా అతలాకుతలం

  • అమెరికాలో తీరం చేరిన హిల్లరీ హరికేన్
  • దక్షిణ కాలిఫోర్నియాలో కుండపోత వర్షాలు
  • ఎడారి ప్రాంతం పామ్ స్ప్రింగ్స్ లోనూ వరదలు
  • వణికించిన భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు
Hurricane Hilary and earthquake fears Southern California

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన హరికేన్ హిల్లరీ ఓవైపు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపుతుండగా, మరోవైపు భూకంపం సంభవించడంతో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. దీని ప్రభావంతో లాస్ ఏంజెల్స్ నగరంలోనూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపానికి సంబంధించి ఆస్తినష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. 

ఇప్పటికే హిల్లరీ హరికేన్ దక్షిణ కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాపై గడచిన ఎనిమిదిన్నర దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో హరికేన్ విరుచుకుపడడం ఇదే ప్రథమం. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తాయి. 

పామ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 6 నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 6 గంటల్లోనే కురిసింది. పామ్ స్ప్రింగ్స్ ఓ ఎడారి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలోనూ వరదలు  వచ్చాయంటే అది హిల్లరీ హరికేన్ ప్రభావమే. 

2.6 కోట్ల మంది ప్రజలపై 'హిల్లరీ' ప్రభావం పడింది. రాగల కొన్ని గంటల్లో ఈ హరికేన్ ఉత్తర దిశగా పయనిస్తుందని అమెరికా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి.

More Telugu News