chandrayaan 3: జాబిల్లికి అవతలి వైపు ఇలా ఉంటుంది.. ఫొటోలు పంపిన ‘విక్రమ్’ ల్యాండర్!

chandrayaan 3 isro releases images of lunar far side area captured by lander camera
  • మరో రెండు రోజుల్లో దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కానున్న విక్రమ్ ల్యాండర్
  • సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం అనువైన ప్రాంతాల అన్వేషణ
  • భూమికి కనిపించని అవతలి వైపు ఫొటోల చిత్రీకరణ
నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగిడడానికి చంద్రయాన్–3 ల్యాండర్ సిద్ధమవుతోంది. చంద్రుడిపై కాలుమోపే చారిత్రక ఘట్టం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లో దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ఈ మేరకు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో భూమికి ఎప్పుడూ కనిపించని జాబిల్లి అవతలి వైపు (దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం) చిత్రాలను ల్యాండర్‌‌ తన కెమెరాల్లో బంధించింది. 

ఆ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘విక్రమ్ ల్యాండర్‌‌కు అమర్చిన ల్యాండర్‌‌ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (ఎల్‌హెచ్‌డీఏసీ).. భూమికి కనిపించని వైపు ఫొటోలను తీసింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. బండరాళ్లు, కందకాలు లేని ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతోంది” అని పేర్కొంది. 

19న ల్యాండర్ ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఆయా ఫొటోలను గమనిస్తే.. చంద్రుడి ఉపరితలంపై అనేక బిలాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాటి పేర్లను కూడా ఇస్రో పేర్కొనడం గమనార్హం. అంతా సవ్యంగా సాగితే 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపుతుందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఈ ఒక్క అడుగు విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన సోవియట్ యూనియన్, అమెరికా, చైనా జాబితాలో భారత్ కూడా చేరుతుంది.
chandrayaan 3
ISRO
lunar
lander camera
Vikram
Lunar South Pole

More Telugu News